Begin typing your search above and press return to search.

కోదండ‌రాం నిర‌స‌న అదిరిపోలేదా?

By:  Tupaki Desk   |   29 April 2016 6:35 AM GMT
కోదండ‌రాం నిర‌స‌న అదిరిపోలేదా?
X
తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం కొత్త త‌ర‌హా దీక్ష‌కు శ్రీ‌కారం చుట్టారు. తెలంగాణలో నెల‌కొన్న క‌రువుపై ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస‌గా స్పందిస్తున్న జేఏసీ ర‌థ‌సార‌థి తాజాగా కొత్త స్టేట్‌ మెంట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరువు తీవ్ర‌త‌ ప్రభుత్వ పెద్దలకు తెలిసేలా త్వరలో మేధావులతో మౌనదీక్ష చేపడతామని ప్ర‌క‌టించారు.

తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్యర్యంలో 'తెలంగాణ కరువు పరిస్థితులపై సమాలోచన' సమావేశం జరిగింది. అందులో అమోదించిన తీర్మానాలను కోదండరాం వెల్లడించారు. కరువుపై పోరాటంలో భాగంగా గవర్నర్‌ కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. దీనిపై ఎలా ముందుకుపోవాలన్న దానిపై ఒక సబ్‌ కమిటీ వేశామని, దాని సూచన మేరకు నడుచుకుంటామని తెలిపారు. తీవ్ర కరువు నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటిని అందించడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నీటి నిల్వలను కేవలం ప్రజలు - పశువుల తాగునీటి అవసరాలకు మాత్రమే వాడాలని కోరారు. వలసల నివారణ కోసం ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఒక్కొక్కరికీ 20 కేజీల రేషన్‌ బియ్యాన్ని అందజేయాలని డిమాండ్‌ చేశారు. వృద్ధులు - వికలాంగులు - నిరాశ్రయులు - ఏ ఆసరాలేని వారికి మధ్యాహ్నభోజన పథకం కింద ఆహారాన్ని అందించాలన్నారు. గ్రామాల్లో మొబైల్‌ వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ తన గ్రామంలో 60 శాతం మంది వలసెళ్లారని, ఊర్లో వృద్ధులు మాత్రమే ఉన్నారని చెప్పారు. వ్యవసాయ - నీటిపారుదల శాఖ సమన్వయంతో పనిచేస్తే కరువును తరిమికొట్టవచ్చన్నారు. పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ కరువుపై విన్నవిద్దామంటే తమను కలిసేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా లేరన్నారు. ప్రజలు సంయమనంతో ఉంటున్నారని, కరువుపై పాలకులు ఇట్లాగే నిర్లక్ష్యం వహిస్తే తిరగబడతారని హెచ్చరించారు. ప్రతిపక్షాలు బలహీనపడితే ప్రజలే ప్రతిపక్షమవుతారన్నారు. తెలంగాణలో సుసంపన్నమైన వారసత్వం ఉన్నదని, వారు ఉద్యమించే రోజలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరువు ప్రకృతి వైపరీత్యం వల్ల రాలేదని, ఇది ముమ్మాటికీ పాలకుల వైఫల్యమేనని అన్నారు. ప్రాజెక్టులు నిండాక చెరువులు నింపే విధంగా కొత్త జలవిధానం తీసుకురావాలని చెప్పినా పాలకులకు చెవికెక్కడం లేదన్నారు.