Begin typing your search above and press return to search.

ఉత్త‌రాంధ్ర‌పై 'సీతాకోకచిలుక' పంజా!

By:  Tupaki Desk   |   10 Oct 2018 7:02 AM GMT
ఉత్త‌రాంధ్ర‌పై సీతాకోకచిలుక పంజా!
X
సీతాకోక‌చిలుక ఏంటి.. ఉత్త‌రాంధ్ర‌ను వ‌ణికించ‌టం ఏమిటనుకుంటున్నారా? ఈ మొత్తం క‌థ‌నం చ‌దివితే విష‌యం మీకు ఇట్టే అర్థ‌మైపోతుంది. క‌నుల‌కు విందు చేసే సీతాకోక‌చిలుక పేరు వింటేనే ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు గ‌జ‌గ‌జ‌లాడిపోతున్నారు. దాదాపు నాలుగేళ్ల క్రితం ఇదే రోజుల్లో(అక్టోబ‌రు 11-12) విశాఖ రూపురేఖ‌లు మార్చేసిన హుదూద్ తుఫానుకు మించిన భారీ ప్ర‌కృతి వైప‌రీత్యం ఇప్పుడు ఉత్త‌రాంధ్ర మీద త‌న పంజాను విస‌ర‌నుంద‌ని వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు.

ప్ర‌కృతి విల‌యాల‌కు.. తుఫాను దాడుల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే ఏపీని తాజాగా తితలీ (సీతాకోక‌చిలుక అని అర్థం) వ‌ణికిస్తోంది. ఉత్త‌ర కోస్తా జిల్లాల‌తో పాటు..శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురం.. ఒడిశాలోని గోపాల్ పూర్ దిశ‌గా ఈ తుఫాను దూసుకొస్తోంది. దీనికి తిత‌లీ అన్న పేరును పాకిస్థాన్ సూచించింది.

గురువారం ఉద‌యం తిత‌లీ తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. తుఫాను తీరం దాటే స‌మ‌యంలో భారీ వ‌ర్షాల‌తో పాటు.. గంట‌కు వంద కిలోమీట‌ర్ల వేగంతో గాలులు విరుచుకుప‌డతాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలోని ముక్కాం ద‌గ్గ‌ర స‌ముద్రం 100 అడుగుల మేర స‌ముద్రం ముందుకు చొచ్చుకు వ‌చ్చింది. దీంతో.. బోటు తిర‌గ‌బ‌డి ఇద్ద‌రు జాల‌ర్ల‌కు గాయాల‌య్యాయి.

నాలుగేళ్ల క్రితం విశాఖ న‌గ‌రాశ‌న్ని ఒక ఊపు ఊపేసి.. విల‌యం సృష్టించిన హుదూద్ కూడా స‌రిగ్గా ఇదే రోజుల్లో వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా అది చూపించిన ప్ర‌తాపంతో విశాఖ ఎంత‌గా విల‌విల‌లాడిపోయిందో తెలిసిందే. నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు అదే రోజుల్లో సీతాకోక‌చిలుక పేరుతో వ‌చ్చిన తాజా తుఫాను ఎంత‌టి విల‌యాన్ని సృష్టిస్తుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. తాజా తుఫాను తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్ప‌టంతో ఉత్త‌రాంధ్ర మొత్తం ఈ ప్ర‌కృతి విల‌యం ఎంత తీవ్రంగా ఉంటుంద‌న్న భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్రయాణాలు పెట్టుకున్న వారు ఎవ‌రైనా.. ఈ నాలుగు రోజులు వాయిదా వేసుకోవ‌టం మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.