Begin typing your search above and press return to search.

ఆంధ్రా ‘గుండె’ తెలంగాణ ‘ప్రాణాన్ని’ నిలిపింది

By:  Tupaki Desk   |   1 Aug 2016 5:16 AM GMT
ఆంధ్రా ‘గుండె’ తెలంగాణ ‘ప్రాణాన్ని’ నిలిపింది
X
నిజమే.. పెద్ద మనసుతో చేసిన ఆలోచనతోనే ఇది సాధ్యమైంది. ఆయుష్షు తీరిన మనిషికి మరో గుండె కొత్త జీవితాన్నిచ్చిన మానవీయ ఘటన ఇది. ఒక మహిళా రోగి గుండె వేదనను.. మరో కుటుంబం ఆవేదనలోనూ అర్థం చేసుకున్న వైనంతో మరో ప్రాణం నిలబడిన పరిస్థితి. తీవ్రఉత్కంఠతో పాటు.. ఎంతో మంది మనసుల్ని దోచిన ఈ ఉదంతం లోకి వెళితే..

హైదరాబాద్ లోని తార్నాక ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల విజయలక్ష్మి పదేళ్లుగా కార్డియో సమస్యలతో బాధ పడుతున్నారు. ఆమెకున్న సమస్యతో రక్తాన్ని పంప్ చేసే గుండె క్రమేపీ తన సామర్ధ్యాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో గుండెను మార్చటం మినహా మరో మార్గం లేని పరిస్థితి. దీంతో ప్రభుత్వ కార్యక్రమైన జీవన్ దాన్ లో పేరు నమోదు చేసుకున్న విజయలక్ష్మి గుండెను ఇచ్చే దాత కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే తిరుపతికి చెందిన 45 ఏళ్ల చిరంజీవిరెడ్డి స్విమ్స్ లో చికిత్స పొందుతూ ఆదివారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. పుట్టెడు శోకంలో ఉన్నప్పటికీ తమ ఇంట ఆగిన వెలుగుతో మరో ఇంట వెలుగులు వెలుగుతాయన్న మాటకు సానుకూలంగా స్పందించి.. అవయువ దానానికి చిరంజీవిరెడ్డి కుటుంబం ఒప్పుకుంది. చిరంజీవిరెడ్డి అవయవాలతో నలుగురి ప్రాణాల్ని నిలబెట్టొచ్చంటూ వైద్యుల చెప్పిన మాటకు ఓకే చెప్పింది. దానానికి గుండెసిద్ధంగా ఉండటంతో స్టార్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ గోపీచంద్.. వైద్యుల బృందం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లింది. అక్కడ చిరంజీవిరెడ్డి గుండెను వేరు చేసి.. విమానంలో హుటాహుటిన బయలుదేరారు.

పోలీసుల సాయంతో గ్రీన్ చానల్ ఏర్పాటు చేయటంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బంజారాహిల్స్ స్టార్ ఆసుపత్రికి కేవలం 25 నిమిషాల వ్యవధిలో గుండెను చేర్చారు. గుండెను తీసిన నాలుగున్నర గంటలలో శస్తచికిత్స ద్వారా అమర్చాల్సి ఉంటంది. లేనిపక్షంలో అప్పటివరకూ జరిగిన ప్రయత్నం మొత్తం వృథా. మొత్తానికి నిర్దిష్ట సమయంలోపే గుండెను విజయలక్ష్మికి అమర్చారు. అలా ఆంధ్రా గుండె.. తెలంగాణలోని ఒకరి ప్రాణాల్ని నిలిపింది. ఇక.. చిరంజీవి రెడ్డి నుంచి సేకరించిన కాలేయం.. రెండు కిడ్నీలను వేర్వేరు వ్యక్తులకు అమర్చారు. కాలేయాన్ని విశాఖలోని అపోలో ఆసుపత్రికి తరలించగా.. ఒక కిడ్నీని నెల్లూరు.. మరో కిడ్నీని స్విమ్స్ లో చికిత్స పొందుతున్న మరో రోగికి అమర్చారు. మానవత్వంతో తీసుకున్న ఒక నిర్ణయం ఎంతమంది ప్రాణాల్నికాపాడిందో కదూ.