Begin typing your search above and press return to search.

హైదరాబాద్ పై ఏపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   10 Sept 2019 3:54 PM IST
హైదరాబాద్ పై ఏపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X
గడిచిన కొద్దిరోజులుగా హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చనున్నట్లుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇది పిచ్చి ఆలోచన అని.. అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశమే లేదని పలువురు కొట్టిపారేస్తున్నారు. తొలుత సోషల్ మీడియాలో పుట్టిన ఈ వార్త.. తర్వాత ప్రధాన మీడియాలోకి వచ్చింది. దీంతో.. ఈ అంశం వాస్తవం కాదని.. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన ఏదీ బీజేపీకి కానీ.. కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదని స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ నేతలు.

ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి సైతం.. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారన్న వాదనను కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీకి చెందిన మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిపుల్ తలాక్.. ఆర్టికల్ 370 నిర్వీర్యం మాదిరే.. మోడీ సర్కారు మరో సంచలననిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన చెప్పారు.

హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబోతన్నారన్న అంశంపై తనకు రహస్యసమాచారం ఉందని.. మోడీ సర్కారు ఈ దిశగా నిర్ణయం తీసుకోవటం ఖాయమన్నారు.ఇందుకు సంబంధించిన ప్రణాళికల్ని కేంద్రం సిద్ధం చేసిందన్నారు. అంతేకాదు.. ఏపీ రాజధాని మీదా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా తిరుపతి కావటం ఖాయమన్నారు.

ముఖ్యమంత్రి జగన్ అమరావతిని వదిలి తిరుపతి రావాలన్నారు. ఏపీ రాజధానిగా తిరుపతి అనుకూలమైన ప్రాంతమన్న ఆయన.. ముఖ్యమంత్రిని వెంటనే తిరుపతికి షిఫ్ట్ కావాలన్న వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర తీయటం ఖాయమంటున్నారు.