Begin typing your search above and press return to search.

నేతలపై నడ్డా తీవ్ర అసంతృప్తి ?

By:  Tupaki Desk   |   14 April 2021 9:30 AM GMT
నేతలపై నడ్డా తీవ్ర అసంతృప్తి ?
X
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర అసంతృప్తితో ఉన్నారా ? రాష్ట్ర, స్ధానికి నేతల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించటంపై నడ్డా మండిపోయినట్లు సమాచారం. మూడు రోజుల ప్రచారంలో భాగంగా నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో నడ్డా ప్రచారం చేశారు. అయితే ఆ సమయంలో నేతల మధ్య సమన్వయలోపం ఉన్న విషయాన్ని ఆయన గ్రహించారని ప్రచారం జరుగుతోంది.

లోక్ సభ ఉపఎన్నికలో ప్రచారాన్ని ఓ ప్రణాళిక ప్రకారం నిర్వహించటం లేదనే విషయాన్ని జాతీయ అధ్యక్షుడు గ్రహించారట. సత్తా ఉన్న నేతలను ప్రచారంలో ఉపయోగించుకోకపోవటం, బాధ్యతలు అప్పగించకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇపుడు కీలకంగా ఉన్న నేతల సత్తా ఏపాటిదో నడ్డాకు బాగా అర్ధమైందట. ఒక ఎన్నికలో కూడా గెలవని, డిపాజిట్లు తెచ్చుకునే సత్తాలేని నేతలే ఉపఎన్నికలో కీలకంగా వ్యవహరిస్తుండటాన్ని నడ్డా గమనించారట.

పైగా ఉపఎన్నిక పేరుతో భారీఎత్తున వసూళ్ళకు ప్రయత్నించిన విషయం కూడా అధ్యక్షుని దృష్టిలో పడిందట. ఉపఎన్నికలో నిధుల కోసం ఓ ముగ్గురు కాంట్రాక్టర్లను బీజేపీలోని కొందరు నేతలు పదే పదే ఫోన్లు చేశారట. అయితే తాము ఇచ్చేది లేదని సదరు కాంట్రాక్టర్లు చెప్పిన వినకుండా విసిగించారట. దాంతో బీజేపీ నేతల వైఖరి గురించి నడ్డాకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

జరుగుతున్నది చూసిన తర్వాత పార్టీ అభ్యర్ధికి కనీసం డిపాజిట్ అన్నా వస్తుందా అనే అనుమానాన్ని నడ్డాయే స్వయంగా పార్టీ నేతల దగ్గర ప్రస్తావించారట. నేతల మధ్య సమన్వయలోపం, కీలకంగా ఉన్న నేతలకు సత్తా లేకపోవటం, కాస్తో కూస్తో గట్టి నేతలు అనుకున్న వాళ్ళని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచేయటం లాంటి అనేక అవలక్షణాలను నడ్డా స్వయంగా చూసినట్లు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఉపఎన్నిక ఫలితం తర్వాత నాయకత్వంలో భారీ మార్పులు తథ్యమనే చెప్పుకుంటున్నారు.