Begin typing your search above and press return to search.

ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయా...?

By:  Tupaki Desk   |   31 March 2023 2:00 PM GMT
ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయా...?
X
ఏపీలో ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారు అయిందా. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా అంటే జవాబు మాత్రం అవును అనే వస్తోందిట. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుంచి ఢిల్లీ దాకా వరస టూర్లు చేయడం హడావుడి పడడం, ఎమ్మెల్యేలను మంత్రులను అలెర్ట్ చేయడం వంటివి చూసినపుడు కచ్చితంగా ఏదో తెర వెనక జరుగుతోంది అని అంటున్న వారే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి జగన్ అయితే ఎన్నడూ లేని విధంగా గత రెండు వారాలలో రెండు సార్లు ఢిల్లీ టూర్లు పెట్టుకుని వచ్చారు. ఈ రెండు సార్ల టూర్లలో బయటకు వినిపించినవి కొన్ని అయితే లోపల జరిగేది మరికొన్ని అని అంటున్నారు. పెండింగ్ బిల్స్ ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినవి తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి ఈ టూర్లు చేస్తున్నారని వైసీపీ తరఫున చెబుతున్నారు.

అలాగే పోలవరం ప్రాజెక్ట్ సహా కీలక ప్రాజెక్టులకు ఏర్పడిన అడ్డంకులను క్లియర్ చేసుకోవడం వంటివి ఉన్నాయని అంటున్నారు. ఈ విషయాలు కూడా కరెక్టే అని అంటున్నారు. ఏపీకి రావాల్సిన బకాయిలు, అలాగే న్యాయంగా కేంద్ర ముంచి రావాల్సిన వాటా, విభజన హామీల అమలు మీద సీఎం కేంద్ర పెద్దలపైన వత్తిడి పెట్టడానికి ఢిల్లీకి వరస టూర్లు చేస్తున్నారు అని అంటున్నారు.

దానితో పాటుగానే సీఎం ఢిల్లీకి రాజకీయ పనుల మీద కూడా వెళ్తున్నారని అంటున్నారు. ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎవరేంటో జనాలు స్పష్టంగా చెప్పేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక అవకాశం ఇచ్చాయి. వాటిని లిట్మస్ టెస్ట్ గా చూసినా వైసీపీ పట్ల వ్యతిరేకత అయితే జనంలో ఉంది అని అంటున్నారు. దాన్ని లైట్ తీసుకోకూడదు అన్నదే వైసీపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు

బయటకు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర నాయకులు జస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పరిమిత సంఖ్యలో ఓటర్లు అని చెప్పుకున్నా మార్పు ఎక్కడో స్టార్ట్ అయిందన్న సంకేతం అయితే వైసీపీ అధినాయకత్వం బాగానే గుర్తించింది అని అంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో అయితే వ్యతిరకత ప్రబలలేదని, అయితే పూర్తిగా ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రభంజనం రేగడానికి ఎక్కువ సమయం కూడా పట్టకపోవచ్చు అని వైసీపీ పెద్దలు కరెక్ట్ గానే ఊహిస్తున్నారు అని తెలుస్తోంది.

ఒక్కసారి కనుక వ్యతిరేకత పెరిగితే దాన్ని ఆపడం ఎవరి తరం కాదన్నది కూడా తెలిసిందే. ప్రస్తుతం విపక్షం ఇంకా ఒక దశలోనే ఆగింది. జనంలోకి పూర్తి స్థాయిలోకి వెళ్ళడంలేది. అదే టైం లో టీడీపీలో లోకేష్ పాదయాత్ర ఇంపాక్ట్ చాలానే ఉంది. ముందు పార్టీ శ్రేణులను ఆయన జాగ్రత్తగా కదిలించగలిగారు అని అంటున్నారు.

ఆ ప్రభావమే వైసీపీకి కంచుకోటలాంటి రాయలసీమలో రెండు పట్టభద్రుల సీట్లు వైసీపీకి గట్టి దెబ్బ కొట్టాయని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆయన తనకు బలం ఉన్నా పొత్తుల కోసం చూస్తున్నారు. అలాగే కామ్రేడ్స్ సైతం టీడీపీకి గట్టి మద్దతుగా నిలిచాయి. అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇలా ఇంకా కూటమి కట్టకుండానే విపక్షంలో సందడి కనిపిస్తోంది.

వారు పూర్తిగా కనుక ఒక త్రాటి మీదకు వచ్చి మేము ఒక్కటి అని గర్జిస్తే ఏపీ రాజకీయ ముఖ చిత్రంలో కీలకమైన సంచలనమైన మార్పులు రావడం తధ్యమని అంటున్నారు. అందుకే వాయువేగంతో వైసీపీ అలెర్ట్ అయింది అని అంటున్నారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో జరిగిన ఓటమిని వైసీపీ లైట్ గా తీసుకోవడం లేదు అని అంటున్నారు.

ఇక వైసీపీ అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఈ ఏడాది డిసెంబర్ లో తెలంగాణాలో ఎన్నికలు ఉన్నాయి. వాటితో పాటే ఏపీలో ఎన్నికలు జరిపించుకోవాలని అంటున్నారు. అలా కనుక జరిగితే కొంత లో కొంత తమకు సానుకూలత ఉంటుందని, దాని వల్ల కొద్దో గొప్పో తేడాతో తాము మెజారిటీ సీట్లు సాధించి ఒడ్డున పడగలమని, ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేయగలమని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఆ దిశగానే వైసీపీ లెక్కలు వేసుకోవడంతోనే జగన్ ఢిల్లీ టూర్లు చేస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో మాత్రం ముందస్తు ముచ్చట ఉందని కచ్చితంగా అంతా చెబుతున్నారు. దానికి రాజకీయ సామాజిక పరిణామలతో పాటు ఆర్ధిక అంశాలు కూడా దోహదం చేస్తున్నాయని తెలుస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.