Begin typing your search above and press return to search.

ఉప ఎన్నిక వేళ.. మునుగోడు గురించి ఇవన్నీ తెలుసుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   4 Oct 2022 4:36 AM GMT
ఉప ఎన్నిక వేళ.. మునుగోడు గురించి ఇవన్నీ తెలుసుకోవాల్సిందే
X
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పే ఎన్నికలుగా మునుగోడు ఉప పోరును పలువురు అభివర్ణిస్తున్నారు. ఫలితం ఎలా వచ్చినా.. ఏ పార్టీ గెలిచినా.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడున్న సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయని చెప్పాలి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన మునుగోడు ఉప ఎన్నికకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

ఈ నేపథ్యంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని అంశాల మీద అవగాహన ఉండటం ద్వారా.. దీనికి సంబంధించిన విషయాలు ఇట్టే అర్థం చేసుకోవటంతో పాటు.. అక్కడి గెలుపు ఓటముల్ని మదింపు చేయటానికి అవకాశం ఉంటుంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ భౌగోళిక స్వరూపాన్ని చూస్తే.. నల్గొండ.. యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ఏడు మండలాలు.. రెండు మున్సిపాలిటీల పరిధిలో విస్తరించి ఉంది.

మునుగోడు నియోజకవర్గానికి వస్తే.. ఇది పూర్తిగా గ్రామీణ నియోజకవర్గంగా చెప్పాలి. మొత్తం 2,27,265 ఓట్లు ఉన్నాయి. ఇందులోకేవలం 32,407 ఓట్లు చౌటుప్పల్.. చండూరు మునిసిపాలిటీల పరిధిలో ఉన్నాయి. మొత్తం ఓట్లలో బీసీలదే అధిక్యత. వారు ఎవరి పక్షాన ఉంటారో వారే గెలుపు వీరులవుతారు. మొత్తం ఓట్లలో దాదాపు 65 శాతం బీసీలే కావటం గమనార్హం.

బీసీలు 1.46 లక్షల ఓట్లు ఉంటే.. ఎస్సీలు 43,286 మందితొ రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో 24,054 మందితో ఓసీలు ఉన్నారు. ఎస్టీలు 12,933 మంది ఉన్నారు.

దీంతో ఈ నియోజకవర్గంలో గెలుపు బీసీలే డిసైడ్ చేస్తారని చెప్పొచ్చు.

మొత్తం ఓటర్లలో పురుష ఓటర్లకు.. మహిళా ఓటర్లకు మధ్య అంతరం తక్కువే. పురుష ఓటర్లు 1.15 లక్షల మంది ఉంటే.. మహిళ ఓటర్లు 1.11 లక్షల మంది ఉన్నారు. థర్డ్ జండర్ ఓటర్లు ఐదుగురు ఉన్నారు.
నల్గొండ జిల్లా పరిధిలో..
- మునుగోడు
- చండూరు
- మర్రిగూడ
- నాంపల్లి
- గట్టుప్పల్‌ మండలాలు ఉన్నాయి.
అదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వచ్చే మండలాల్ని చూస్తే..
- చౌటుప్పల్‌
- సంస్థాన్‌ నారాయణపురం వస్తాయి.
నల్గొండ జిల్లాలోని చండూరు మున్సిపాలిటీగా ఉంటే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మున్సిపాలిటీగా ఉంది. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉంటే.. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని ప్రచారం జరుగుతున్నా.. కేసీఆర్ మాత్రం అధికారికంగా ప్రకటించింది లేదు. ఈ నియోజకవర్గంలో అత్యధికసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ.. తాజాగా మాత్రం ఆర్థికంగా బలహీనంగా ఉండటం మైనస్ గా మారిందని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.