Begin typing your search above and press return to search.

టైమ్ లో మోడీ మీద రాసింది అత‌డా?

By:  Tupaki Desk   |   12 May 2019 5:51 AM GMT
టైమ్ లో మోడీ మీద రాసింది అత‌డా?
X
ప్ర‌ధాని మోడీని విమ‌ర్శించే ద‌మ్మున్న మీడియా సంస్థ‌లు దేశంలో త‌క్కువే అన్న విమ‌ర్శ ఒక‌టి ఉంది. ఆయ‌న పాల‌నా లోపాల్ని ఎత్తి చూపే విష‌యంలో మీడియా మొత్తం ఫెయిల్ అయ్యింద‌న్న వాద‌న ఉంది. అయితే.. ఇది వైఫ‌ల్యం అనే కంటే.. మీడియా పరిమితులు ఎక్కువ అవుతున్నాయ‌న్న కోణంలో చూడ‌టం మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మోడీని విభ‌జ‌న‌కారిగా అభివ‌ర్ణిస్తూ తాజాగా అమెరిక‌న్ మీడియా సంస్థ టైమ్ మ్యాగ‌జైన్ ఒక సంచ‌ల‌న క‌థ‌నాన్ని క‌వ‌ర్ పేజీ స్టోరీగా అచ్చేయ‌టం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అదే స‌మ‌యంలో ఆ క‌థ‌నం స‌త్య‌మ‌ని.. అందులో అన్ని నిజాలు ఉన్న‌ట్లుగా కొంద‌రు నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే ఏకంగా రీట్వీట్ చేశారు.

ఈ విష‌యంలోరాహుల్ చ‌ర్య‌ను కూడా త‌ప్పు ప‌ట్టాల్సిందే. ఎందుకంటే.. ఒక ఆర్టిక‌ల్ త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలకు మేలు క‌లిగించేదిగా ఉన్నంత‌నే ట్వీట్ చేసే క‌న్నా.. దాని వెనుక ల‌క్ష్యాన్ని చెక్ చేసుకున్న త‌ర్వాత ట్వీట్ చేసి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే..టైమ్ లో ప్రింట్ అయిన నెగిటివ్ క‌థ‌నంపై బీజేపీ పోస్ట్ మార్టం మొద‌లెట్టింది.

ఈ క‌థ‌నాన్ని రాసిన ర‌చ‌య‌త పాకిస్థానీ జాతీయుడిగా బీజేపీ అధికార ప్ర‌తినిధి సంబిత్ పాత్ర వెల్ల‌డించారు. పొరుగు దేశం ఎజెండాతో మోడీపై బుర‌ద జ‌ల్ల‌టానికి ప్ర‌య‌త్నం జ‌రిగిన‌ట్లు ఆరోపించారు. పాకిస్థానీ వ్య‌క్తి నుంచి ఇంత‌కంటే ఎక్కువ ఆశించ‌గ‌ల‌మా? అని ప్ర‌శ్నించారు. మోడీపై నెగిటివ్ స్టోరీ రాసిన సంబిత్ త‌ల్లి భార‌తీయ పాత్రికేయురాలైన తవ్లీన్ సింగ్ అని.. తండ్రి పాక్ రాజ‌కీయ నేత‌.. వ్యాపార‌వేత్త అయిన స‌ల్మాన్ త‌సీర్ అని చెప్పారు. మొత్తానికి మోడీ మీద ప‌బ్లిష్ అయిన క‌థ‌నం పాకిస్థానీ జ‌ర్న‌లిస్ట్ రాశార‌న్న మాట‌తో.. ఆ క‌థ‌నం మీద విశ్వ‌స‌నీయ‌త మీద అనుమానాలు క‌లిగేలా చేయ‌టంలో మోడీ ప‌రివారం స‌క్సెస్ అయ్యింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.