Begin typing your search above and press return to search.

సుబ్రహ్మణ్యస్వామి ఎంట్రీ..అయోధ్య మళ్లీ హీటెక్కినట్టే

By:  Tupaki Desk   |   6 Jun 2019 1:59 PM GMT
సుబ్రహ్మణ్యస్వామి ఎంట్రీ..అయోధ్య మళ్లీ హీటెక్కినట్టే
X
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు వరుసగా రెండో మారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణం మరోమారు తెరపైకి వచ్చింది. ఎప్పుడు అవకాశం వచ్చినా... రామ మందిరం నిర్మాణంపై తనదైన శైలి వ్యాఖ్యలు గుప్పించే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామే ఈ దఫా కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. రెండో సారి మోదీ పదవీ ప్రమాణం చేసిన మరునాడే దీనిపై మాట్లాడిన సుబ్రహ్మణ్య స్వామి... తాజాగా గురువారం మరోమారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాల్సిందేనని, ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిందేనని ఆయన మోదీకి సూచించారు.

అంతటితో ఆగని స్వామి... అయోధ్యలో రామ జన్మభూమికి సంబంధించి వివాదంలో ఉన్న భూమి ఎవరికి చెందినా కూడా అది కేంద్ర ప్రభుత్వానిదేనని, ఆ భూమికి పరిహారం చెల్లించేసి రామ మందిరాన్ని నిర్మించాలని ఆయన కాస్తంత లాజికల్ పాయింట్ నే ప్రస్తావించారు. ఈ వివాదం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లో ఉందన్న విషయాన్ని చెబుతూనే... ఆ భూమి ఎవరికి చెందినదైనా... దానిని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఎప్పుడో జాతీయం చేశారని, వివాదంలో ఉన్న భూమితో పాటు వివాదం లేని భూమి కూడా కేంద్రానికే చెందుతుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రామ మందిరం నిర్మించదలచిన భూమి ఎవరికి చెందినదైనా... హక్కులు దక్కే వారికి పరిహారం చెల్లిస్తే సరిపోతుందని కూడా స్వామి చెప్పుకొచ్చారు.

2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రాగానే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగి తీరుతుందని స్వామి లాంటి వారంతా బల్ల గుద్ది మరీ చెప్పారు. అయితే మోదీ సర్కారు ఆ దిశగా కాస్తంత ఆచితూచే వ్యవహరించిందని చెప్పక తప్పదు. అయితే వరుసగా రెండో దఫా కూడా మోదీనే పీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఈసారి తప్పనిసరిగా రామ మందిరాన్ని నిర్మించి తీరాల్సిందేనని స్వామి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే మోదీకి ఓ సారి లేఖ రాసిన స్వామి తాజాగా... వివాదాన్ని ఎలా అధిగమించాన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరి స్వామి వాదనపై మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి.