Begin typing your search above and press return to search.

టిక్ టాక్.. టిప్ 'టాప్'

By:  Tupaki Desk   |   24 Dec 2021 12:31 PM GMT
టిక్ టాక్.. టిప్ టాప్
X
అది నడిచినన్నాళ్లూ.. క్రియేటివిటీకి పెట్టని కోటలా.. కొందరికి అదే లోకంలా.. మరికొందరికి సరదాగా.. ఇంకొందరికి రోజువారీ దినచర్యలా.. చాలామందికి అదే జీవితంలా సాగింది.. సినిమాపాటకు పేరడీ అయినా, ఆట పట్టించే అంశాలకైనా, నవ్వించే సన్నివేశానికైనా అదే వేదిక. ఇంత ఉపోద్ఘాతం దేని గురించంటే.. ‘‘టిక్ టాక్’’. ఇప్పుడంటే మన దేశంలో బ్యాన్ ఉంది గానీ, కరోనా కు ముందు టిక్ టాక్ హవా చలాయించింది. కుర్రకారు అందులోనూ అమ్మాయిలు టిక్ టాక్ వీడియోలు చేయడం అంటే ప్రాణం పెట్టేవారు.

చాలామంది అయితే టిక్ టాక్ వీడియోలు చేయడాన్ని ఉపాధిగానూ ఎంచుకున్నారు. ఈ మేరకు కొందరు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. కాలం బాగుంటే.. మన దేశంలో టిక్ టాక్ రేంజ్ ఇప్పుడు ఎక్కడో ఉండేది. కానీ, కరోనా దెబ్బతో పాటు గాల్వాన్ లో భారత సైనికుల ప్రాణాలు తీసిన కుటిల చైనాకు బుద్ది చెప్పేందుకు భారత ప్రభుత్వం టిక్ టాక్ తోక కత్తిరించింది. అయినా..గూగుల్ లో బాగా వెదికారట..

భారత్ లో నిషేధం, అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను పక్కనపెడితే.. టిక్ టాక్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లిందన్నది వాస్తవం. ఈ విషయం నిపుణులు చెబుతున్నదే. గూగుల్ లో బాగా వెదికినది టిక్ టాక్ గురించేనని ఓ అధ్యయనంలో తేలింది. అందుకనే మోస్ట్ విజిటెడ్ సైట్ గా నిలిచింది.

ఫేస్ బుక్ ను తోసిరాజనిటిక్ టాక్ మోస్ట్ విజిటెడ్ సైట్ గా నిలిచింది అల్లాటప్పాగా కాదు. సోషల్ మీడియా దిగ్గజం పేస్ బుక్ ను, గూగుల్ ను పక్కకునెట్టి మరీ టిక్ టాక్ టాప్ లో వచ్చింది. స్టోరేజీ సాఫ్ట్ వేర్ సంస్థ క్లౌడ్ ఫ్లేర్ వెబ్ ట్రాఫిక్ ను బట్టి టిక్ టాక్ కు పట్టం కట్టింది. అంతేకాక విపరీతంగా వినియోగించిన (వైడ్లీ యూజ్డ్ ) సోషల్ మీడియా ప్లాట్ ఫారంగానూ నిలిచింది. ఈ లెక్కలు 2021 కి సంబంధించినవని క్లౌడ్ ఫ్లేర్ తెలిపింది.

ఐదేళ్లలోనే ఇంతింతై..

టిక్ టాక్ అంటే ఇప్పుడో పెద్ద సంస్థ. లక్షల కోట్ల ఆదాయం ఉన్న సంస్థ. దీని ఉద్యోగులకూ భారీ ప్యాకేజీలు, వసతులు ఉంటాయి. కానీ, టిక్ టాక్ పుట్టింది ఓ స్టార్టప్ గా. అది కూడా 2016లో. అంటే ఐదేళ్లలోనే ప్రపంచ దిగ్గజాలను పడగొట్టిందన్నమాట. టిక్ టాక్ చైనా సంస్థ బైట్ డ్యాన్స్ కు చెందినది.

మార్కెట్ లోకి వచ్చిన ఏడాదికే ప్రపంచ వ్యాప్తంగా విప్లవం రేపింది. అందరినీ ఆకట్టుకుంది. అమెరికాలో అయితే, 2020 నాటికి దీని క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఫ్లీట్‌వుడ్ మాక్ వింటూ ఇడాహో నివాసి నాథన్ అపోడాకా స్కేట్‌బోర్డింగ్ , ఓషన్ స్ప్రే క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగినట్లు చూపే తదితర వీడియోలతో ఇది బాగా పాపులరైంది. అయితే,భారత్ లో ప్రస్తుతం టిక్ టాక్ పై నిషేధం కొనసాగుతోంది. బైట్ డ్యాన్స్ భారత్ లోని తన ఉద్యోగులకు ప్యాకేజీ ఇచ్చి పంపించింది.