Begin typing your search above and press return to search.

అమరావతికి తికాయత్.. అసలు నిజం ఎంత?

By:  Tupaki Desk   |   5 Feb 2021 9:30 AM GMT
అమరావతికి తికాయత్.. అసలు నిజం ఎంత?
X
అమరావతి రాజధానిగా ఆ ప్రాంతానికి చెందిన రైతులు ఏడాదికి పైగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పాలుపంచుకుంటున్న రైతులు పలువురు తాజాగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో సాగుతున్న రైతు ఉద్యమానికి తమ మద్దతు పలికారు. అక్కడ జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొంటున్న వారు.. సేవ్ అమరావతి.. సేవ్ ఏపీ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు.

అమరావతి కోసం రాజధాని రైతులు 34 వేల ఎకరాల్ని ప్రభుత్వానికి ఇస్తే.. కొత్తగా వచ్చిన ప్రభుత్వం రాజధానిగా అమరావతిని కాదని.. మూడు రాజధానుల పేరుతో రైతుల్ని అనేక ఇబ్బందులకు.. వేధింపులకు గురి చేస్తున్నట్లుగా వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కౌలు డబ్బు కూడా సక్రమంగా ఇవ్వటం లేదని.. రాజధాని కోసం భూములుఇస్తే.. ఇప్పుడు అక్కడ రాజధానిని తరలిస్తూ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

తాజాగా అమరావతి రైతులకు సంబంధించిన కొందరు ప్రతినిధులు.. రైతు ఉద్యమం చేస్తున్న తికాయత్ ను కలిశారు. తమ సమస్యల గురించి.. తాము చేస్తున్న ఉద్యమం గురించి వివరించారు. రాజధాని పరిరక్షణ కోసం తాము చేస్తున్న పోరాటాల వివరాల్ని తికాయత్ శ్రద్ధగా విన్నారని అమరావతి రైతులు చెబుతున్నారు. రైతు ఉద్యమం తర్వాత తికాయత్ అమరావతికి వస్తారని చెబుతున్నారు. ఈ మాట చెప్పింది కేవలం రైతుల ప్రతినిధులే తప్పించి.. తికాయత్ కానీ ఆయన వర్గీయులు కాదన్నది మర్చిపోకూడదు. ఒకవేళ.. అమరావతి అంశంపై అంత సానుభూతిగా తికాయత్ విని ఉంటే.. ఈపాటికి స్పందించే వారు కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏమైనా.. అమరావతి ఇష్యూలో తికాయత్ కల్పించుకునే అవకాశాలు పెద్దగా లేవన్న మాట వినిపిస్తోంది.