Begin typing your search above and press return to search.

రాజ‌ధాని రైతుల‌కు ప‌రిహార‌మే అంద‌లేదా?

By:  Tupaki Desk   |   26 Feb 2018 12:41 AM GMT
రాజ‌ధాని రైతుల‌కు ప‌రిహార‌మే అంద‌లేదా?
X
న‌వ్యాంధ్రప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలో టీడీపీ స‌ర్కారు చెబుతున్న‌ట్లుగా... రైతులేమీ సంతోషంగా లేర‌నే చెప్పాలి. ఇందుకు నిన్న అర్థ‌రాత్రి అమ‌రావ‌తి ప‌రిధిలోని తాత్కాలిక స‌చివాలయం సాక్షిగా నెల‌కొన్న తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులే నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలేమో. రాజ‌ధాని నిర్మాణానికి భూములు అడ‌గంగానే రైతులంతా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చార‌ని - ఈ క్ర‌మంలో దేశంలో మ‌రెక్క‌డా కూడా లేని విధంగా రైతుల‌కు ప్యాకేజీ ప్ర‌క‌టిస్తున్నామ‌ని చంద్ర‌బాబు స‌ర్కారు గొప్ప‌లు చెప్పుకుంది. భూముల‌కు ప‌రిహారంతో పాటుగా రాజ‌ధానిలో నివాస ఫ్లాటు - వ్యాపార నిమిత్తం మ‌రో ఫ్లాటు ఇవ్వ‌డంతో పాటుగా రాజ‌ధానికి భూములిచ్చిన రైతులు అన్ని ర‌కాలుగా బాగుండేలా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని కూడా చంద్ర‌బాబు స‌ర్కారు ఘ‌నంగానే ప్ర‌క‌టించింది. అంతేకాకుండా తాము స‌రికొత్త‌గా చేప‌ట్టిన భూ స‌మీక‌ర‌ణ‌కు ఏ ఒక్క రైతు కూడా వ్య‌తిరేక‌త చూప‌లేద‌ని - రైతులే స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి రాజ‌ధానికి భూములిచ్చార‌ని కూడా టీడీపీ స‌ర్కారు ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చింది. అయితే ఈ విష‌యంలో ఎంత‌మాత్రం వాస్త‌వం లేద‌న్న విష‌యం ఇప్ప‌టికే చాలా ప‌ర్యాయాలు బ‌య‌ట‌ప‌డ్డా... టీడీపీ స‌ర్కారు మాత్రం ఆయా ఘ‌టన‌లు త‌మ దృష్టిలోకే రాలేదన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోంది.

అయినా ఇప్పుడు ఈ చ‌ర్చ ఎందుకంటే... ఓ వైపు రాజ‌ధాని నిర్మాణానికి భూములిచ్చేసిన రైతుల‌ను ఫారిన్ టూర్ల‌కు పంపిస్తున్నామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు స‌ర్కారు... అదే స‌మ‌యంలో ఇంకా త‌మకు స‌రైన ప‌రిహార‌మే అంద‌లేదంటూ ఆందోళ‌న‌కు దిగుతున్న రైతుల‌పై మాత్రం ఉక్కుపాదంద మోపుతోంది. బంగారం లాంటి పంట‌లు పండే భూముల‌ను రాజ‌ధాని పేరిట లాగేసుకుని - క‌నీసం ప్ర‌క‌టించిన ప‌రిహారం కూడా అందించ‌కుండానే... ఆ భూముల్లో ప‌నులు ఎలా చేస్తారంటూ ఆందోళ‌న‌కు దిగిన రైత‌న్న‌ల‌ను నిన్న బాబు స‌ర్కారు ఏకంగా ఖాకీల చేత అరెస్ట్ చేయించింది. నిన్న రాత్రి అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌కే తెర తీసింద‌ని చెప్పాలి. అస‌లు రాజ‌ధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల‌కు ప్ర‌భుత్వం ఏ మేర ప‌రిహారం అందించింద‌న్న విష‌యంపైనా అనుమానాలు రేకెత్తించేలా ఉన్న ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. అమరావతిలోని సచివాలయం వద్ద సీఆర్‌ డీఏ నిర్మిస్తున్న రహదారి పనులను గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి రైతులు అడ్డుకున్నారు. అయితే దీనిపై స‌మాచారం అందుకున్న ఖాకీలు హుటాహుటీన అక్క‌డ‌కు వెళ్లి రైతుల‌పై త‌మ‌దైన శైలిలో ప్ర‌తాపం చూపారు. తొలుత ప‌క్కకు నెట్టేసిన రైతుల‌ను ఆ త‌ర్వాత అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌ కు త‌ర‌లించారు.

ఆదివారం అర్థరాత్రి వెలగపూడి సచివాలయం సీఎం బ్లాకు వెనుక ఉన్న భూమిలో పరిహారం ఇవ్వకుండా సీఆర్‌ డీఏ రహదారి పనులు చేస్తోందంటూ రైతు గద్దె మీరా ప్రసాద్ అడ్డుకున్నారు. ఆయనకు మద్దతుగా మరికొంత మంది రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. సుమారు అరగంటకు పైగా ఆందోళన చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను తరలించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. తమ పొలంలో అన్యాయంగా రహదారి నిర్మిస్తే ఆత్మహత్య చేసుకుంటానని రైతు మీరా ప్రసాద్ హెచ్చరించారు. దీంతో పోలీసులు రైతులను బలవంతంగా పక్కకు తొలగించి పనులు కొనసాగించారు. అయినా రైతులు స్వ‌చ్ఛందంగా భూములు ఇచ్చార‌ని చెబుతున్న ప్ర‌భుత్వం ప‌గ‌లంతా నిద్ర‌పోయి... రాత్రి వేళ‌లోనే ప‌నులు ఎందుకు చేస్తోంద‌న్న విష‌యం కూడా రైతుల వాద‌న‌లో నిజ‌ముంద‌ని చెప్ప‌క‌నే చెబుతోంది. మొత్తానికి నిన్న‌టి ఘ‌ట‌న రాజ‌ధాని రైతుల్లో ఆగ్ర‌హావేశాల‌ను ర‌గిలించేలానే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.