Begin typing your search above and press return to search.

వైసీపీలో చేరినా కేసులు వదలడం లేదా?

By:  Tupaki Desk   |   21 Aug 2020 10:10 AM GMT
వైసీపీలో చేరినా కేసులు వదలడం లేదా?
X
ఒక ఎమ్మెల్యే పార్టీ మారడానికి ప్రధానంగా కేసులు.. లేదంటే ఆర్థికంగా దెబ్బపడితేనే అలా కండువా మార్చేస్తారు. లేదంటే సుబ్బరంగా గెలిచిన పార్టీలోనే ఉంటారు. వ్యాపారాలు దెబ్బతినకుండా కొందరు.. ఆస్తులు కాపాడుకోవడానికి మరికొందరు.. కేసుల నుంచి బయటపడడానికి మరికొందరు అధికార పార్టీ వైపు చూస్తారు. ఇలానే తమ రాజకీయ అవసరాల కోసం వైసీపీలో చేరిన ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలపై కేసులు నమోదు కావటం వైసీపీ పార్టీలో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు ఎమ్మెల్యే మద్దాళిగిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలు ఈ మధ్య కాలంలో వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఈ ముగ్గురిపై పోలీసు కేసులు నమోదుకావడంతో వైసిపి డిఫెన్స్ లో పడిందన్న చర్చ సాగుతోంది.

వల్లభనేని వంశీ ఇళ్ల ఇళ్లస్థలాలు పట్టాలు ఫోర్జరీ చేశారని బావులపాడు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టరైంది. బావులపాడు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.తహసీల్లార్ సంతకాలను వంశీ ఫోర్జరీ చేసి నకిలీ పట్టాలను ఇచ్చి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేశారన్నది ఆయనపై నమోదైన కేసు సారాంశం. ఈ కేసు నమోదయ్యాకే వల్లభనేని వంశీ వైసీపీ వైపు వచ్చారు.

ఇక కరణం బలరాంపై గత ఏడాది ఆగస్టు 15 తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వైసీపీ నేతలు రవిశంకర్ తదితరులపై దౌర్జన్యం చేశారన్న కేసు పెండింగులో ఉంది .అలాగే కరణం బలరామ్ తన సంతానం విషయంలో తప్పుడు ఆఫిడవిటు దాఖలు చేశారని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ ను కూడా హైకోర్టులో పెండింగ్ లో ఉంది. బలరాం కి రెండో భార్య ద్వారా అంబికా అనే కూతురు ఉండగా దానిని ఆయన తన ఎన్నికల ఆఫిడవిటులో దాచిపెట్టారని కృష్ణమోహన్ హైకోర్టు కెక్కారు. అంతేకాకుండా ఆయనకు చెందిన గ్రానైట్ పరిశ్రమలకు ప్రభుత్వం ముప్పై మూడు కోట్ల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బలరాం వైసిపి వైపు వచ్చారంటారు.

తాజాగా మద్దాలి గిరి ఒక పోలీస్ కేసులో ఇరుక్కున్నారు. గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో ఉన్న డీబీ ఫ్యాషన్స్ అనే వ్యాపార దుకాణాన్ని మద్దాళిగిరి అనుచరులు ఆక్రమించుకుంటున్నారని దీనికి ఎమ్మెల్యే మద్దతు పూర్తిగా ఉందని సదరు దుకాణం యాజమాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆయనతో సహా అందరి మీద కేసు నమోదు చేయాలని ఉన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.

పార్టీకి మద్దతు ప్రకటించిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా కేసుల్లో ఉండడంతో ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో వైసిపి నాయకులు ఉన్నారు. ఈ ముగ్గురు వలస ఎమ్మెల్యేల విషయంలో వైసిపి నాయకత్వం డిఫెన్స్ లో పడిపోయినట్టు ప్రచారం సాగుతోంది.