Begin typing your search above and press return to search.

అమెరికా ఎంబసీ పై మూడు రాకెట్లతో దాడి చేసిన ఇరాన్ !

By:  Tupaki Desk   |   21 Jan 2020 11:45 AM IST
అమెరికా ఎంబసీ పై మూడు రాకెట్లతో దాడి చేసిన ఇరాన్ !
X
ఇరాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖాసిం మృతితో ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే అమెరికాను దెబ్బకు దెబ్బ తీసేందుకు ఇరాన్ మిలటరీ వ్యూహాలు రచిస్తోంది. అమెరికా కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇరాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖాసిం సొలేమనిపై ఈ నెల 3వ తేదీన డ్రోన్లతో దాడి చేసి అమెరికా బలగాలు హతమార్చాయి. ఇందుకు ప్రతీకార చర్యల్లో భాగంగా ఇరాన్ కూడా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాల పై క్షిపణి దాడులు చేసింది. అయితే , ఈ ఘటన జరిగిన తరువాత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఇరాన్ మళ్లీ విరుచుకుపడింది.

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌ హై సెక్యూరిటీ గ్రీన్‌ జోన్‌లో ఉన్న అమెరికా ఎంబసీకి సమీపంలో మూడు రాకెట్లు దూసుకొచ్చాయి. ఇక్కడికి సమీపంలో మూడు రాకెట్లు పడ్డాయని, ఆస్తినష్టం తప్ప, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా ఇంకా స్పందించలేదు. ఇరాన్ నుంచి ఈ రాకెట్లు వచ్చినట్టు తెలుస్తుండగా, అవి లక్ష్యాన్ని తప్పాయని తెలుస్తోంది.

ఇరాన్‌ సైనిక కమాండర్‌ సులేమానిని యూఎస్ దళాలు హతమార్చిన తరువాత, ఇరాన్, ఇరాక్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు యూఎస్ ఎంబసీ పై క్షిపణి దాడులు జరుగగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రం గా స్పందించారు. ఈ క్రమంలో జరిగిన ఈ దాడి మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది. ఏ క్షణమైనా ఇరాన్ రెచ్చిపోయే అవకాశం ఉన్నందున అమెరికా కూడా ముందస్తు జాగ్రత్తతో అన్ని చర్యలు తీసుకుంటుంది.