Begin typing your search above and press return to search.

ఎవరీ బొగ్గారపు దయానంద్.. కేసీఆర్ ప్రకటనతో ఒక్కసారిగా ఫేమ్ లోకి

By:  Tupaki Desk   |   14 Nov 2020 10:00 AM IST
ఎవరీ బొగ్గారపు దయానంద్.. కేసీఆర్ ప్రకటనతో ఒక్కసారిగా ఫేమ్ లోకి
X
ఊహించని నిర్ణయాలు తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఆ మధ్యన ఖాళీ అయిన గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్ని తాజాగా భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదట్నించి అనుకున్నట్లే.. ప్రజాకవి.. రచయిత గోరటి వెంకన్నతో పాటు మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్యలకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. వారితో పాటు.. బొగ్గారపు దయానంద్ కు ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

గోరటి వెంకన్న.. బస్వరాజ్ సారయ్యలు తెలంగాణ ప్రజలకు సుపరిచితమే కానీ.. బొగ్గారపు దయానంద్ మాత్రం పెద్దగా పరిచయం లేదు. చాలా పరిమిత స్థాయిలో మాత్రమే తెలిసిన నేతగా చెబుతారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నవేళలో ఆయన వద్ద పని చేసినట్లుగా చెబుతారు. ఆర్యవైశ్య ప్రముఖుడిగా ఆ వర్గంలో బాగా పాపులర్. వివాదరహితంగా ఉండటంతో పాటు.. కేసీఆర్ కు సుదీర్ఘకాలంగా సన్నిహితుడు. ఆర్యవైశ్య ప్రముఖులుగా చెలామణీ అయ్యే పలువురి కంటే సీనియర్ అయినప్పటికి.. మీడియాలో పెద్దగా ఫోకస్ కాకపోవటం.. లోప్రొఫైల్ మొయింటైన్ చేయటంతో ఎవరి కంట్లో పెద్దగా పడలేదని చెబుతారు.

ఉమ్మడి ఏపీలో సాధారణ పరిపాలన శాఖలో పని చేసిన ఆయన 2003లో రిటైర్ అయ్యారు. వ్యాపార వర్గానికి చెందిన ఆయన.. ఆర్థికంగా స్థితిమంతుడన్న పేరుంది. హైదరాబాద్ మహానగర నివాసి అయిన ఆయన.. ఆర్యవైశ్య వర్గాల్లో మంచి పేరుంది. గ్రేటర్ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. దయానంద్ నియామకం అత్యంత వ్యూహాత్మకమైనదిగా అభివర్ణిస్తున్నారు. వ్యాపారాల్లో తిరుగులేని అధిక్యత ఉన్న ఆర్యవైశ్య సామాజిక వర్గానికి రాజకీయంగా ఆదరించే పార్టీలు లేవన్న పేరుంది. అంతేకాదు.. ఆ వర్గానికి చెందిన వారిని అవసరానికి వాడుకోవటమే తప్పించి.. రాజకీయ పదవులకు దూరంగా ఉంచుతుననారన్న ఆగ్రహం ఆ వర్గానికి చెందిన వారిలో ఉంది.

ఇలాంటివేళ.. బొగ్గారపు దయానంద్ లాంటి వివాదరహిత నేతకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టటం ద్వారా.. ఆ వర్గానికి చెందిన వారికి దగ్గర కావటమే కాదు.. కీలకమైన గ్రేటర్ ఎన్నికల్లో ఎంతో ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. సుదీర్ఘకాలం టీఆర్ఎస్ నేతగా ఉన్నా.. తనకు గుర్తింపు..సరైన పదవి లభించలేదన్న ఆవేదన ఉన్న బొగ్గారపు దయానంద్ కు.. ఎమ్మెల్సీ హోదా కట్టబెట్టటం ద్వారా.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చన్న విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.