Begin typing your search above and press return to search.

వరంగల్ లో ఫ్యాక్షన్ హత్యలు .. కారణం ఇదే !

By:  Tupaki Desk   |   2 Sep 2021 3:30 PM GMT
వరంగల్ లో ఫ్యాక్షన్ హత్యలు .. కారణం ఇదే !
X
వరంగల్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆస్తి తగాదాలతో తమ్ముడు, తన సొంత అన్న, వదిన, బావమరిదిలను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. అడ్డువచ్చిన అన్న కుమారులపైనా దాడి చేశాడు. తెల్లవారుజామున కర్కోటక గ్యాంగ్‌ తో వచ్చి సృష్టించిన దారుణకాండతో జనం భయంతో వణికిపోయారు. వరంగల్‌ ఎల్బీనగర్‌ లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. భార్యాభర్తలు చాంద్‌ పాషా, సాబీర బేగం తో పాటు ఆమె సోదరుడు ఖలీల్‌ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. చాంద్‌పాషా కుమారులు తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడుతుండగా, కుమార్తె రుబీన ప్రాణాలు నిలుపుకుంది. పాశవిక హత్యలకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

ఈ ఘటన కి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పరకాలకు చెందిన చాంద్‌పాషా, షఫీ స్వయానా అన్నదమ్ములు. వీరు పశువులను కొని కబేళాలకు అమ్మడంతో పాటు పశువులను వధించి మాంసాన్ని విక్రయించే వ్యాపారం చేస్తుంటారు. చాంద్‌ పాషాకు భార్య సాబీరా బేగం, కుమారులు పహద్‌, సమీర్‌, కూతురు రుబీనా ఉన్నారు. పరకాల నుంచి వచ్చి ఎల్బీనగర్‌ లో ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు. షఫీ ఎల్బీనగర్‌ మదీనాకాలనీలో ఉంటున్నాడు. వ్యాపారంలో రూ.కోటి 20 లక్షలకు సంబంధించి చాంద్‌ పాషాకు, షఫీకి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రెండుమూడుసార్లు పెద్ద మనుషులు పంచాయితీ చేసినా పరిష్కారం కాలేదు.

దీంతో ఇద్దరి మధ్య ఏడాదికాలంగా గొడవలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో చాంద్‌పాషా కుటుంబంపై కక్ష పెంచుకున్న షఫీ, అంతం చేయడానికి పక్కా ప్లాన్ వేశాడు. ముగ్గురి హత్యలో పాల్గొన్న వారిలో ప్రధాన నిందితుడు షఫీకి సంబంధించిన స్నేహితులు, సేవకులు ఉన్నట్లు సమాచారం. వీరికి, చాంద్‌పాషాకు చాలాఏళ్లుగా పరిచయం కూడా ఉన్నట్లు సమాచారం. వీరి పశువులు, మాంసం వ్యాపారంలో సుమారు 10 సంవత్సరాల పైన పనిచేస్తున్న వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు షఫీ డ్రైవర్‌ కూడా ఈ హత్యల సంఘటనలో నిందితుడిగా ఉన్నాడు.

ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కత్తులు, తల్వార్‌లు, ఎలక్ట్రిక్ రంపం మిషన్లతో నిందితులు ఎటాక్ చేసినట్టు గుర్తించారు. హత్యోదంతంలో మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నర్సంపేటకు చెందిన గొర్రెల కాపరి వెంకన్న, రూపిరెడ్డిపల్లెకు చెందిన విజేందర్, లారీ డ్రైవర్ ఎండీ పాషా, ఉర్సుగుట్టకు చెందిన మీర్జా ఇక్బాల్, సాధిక్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. షఫీ సెల్‌ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ గ్యాంగ్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఫ్యాక్షన్‌ తరహాలో జరిగిన హత్యలతో నగరం ఉలిక్కిపడింది.

వరంగల్‌ నగరంలో ఓ వ్యక్తి ఉన్మాదంతో సొంత అన్న కుటుంబంపైౖ వేట కొడవళ్లతో దాడి చేయడం, ఈ దాడిలో ముగ్గురు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. స్థానికంగా ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. వేటకొడవళ్లతో విచక్షణ రహితంగా నరకడంతో మృతుల శరీరాలు రక్తపుముద్దలా మారిపోయాయి. సంఘటన స్థలమంతా నెత్తురు చింది భయానకంగా మారింది. షఫీ వృత్తిరీత్యా పశువుల విక్రయంతో పాటు పశుమాంసం వ్యాపారం చేస్తాడని, దీంతో పశువులను నరికినంత సులువుగా చాంద్‌పాషా కుటుంబంపై దాడికి తెగబడ్డాడని స్థానికులు చర్చించుకుంటున్నారు.