Begin typing your search above and press return to search.

మూడు రాజధానులు.. ఈ రోజు నుండి రోజువారీ విచారణ

By:  Tupaki Desk   |   6 Oct 2020 3:20 PM IST
మూడు రాజధానులు.. ఈ రోజు నుండి రోజువారీ విచారణ
X
రాజధాని అమరావతి మార్పు, మూడు రాజధానుల ఏర్పాటుకి సంబంధిత కేసులపై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు నుంచి రోజువారీ విచారణ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాజధాని మార్పుపై మొత్తం 223 అనుబంధ పిటిషన్లు ఉన్నట్లు హైకోర్టు తెలిపింది. ఇందులో 189 పిటిషన్లు స్టే కోసం వేశారు. దీంతో మిగిలిన 34 పిటీషన్‌ లను ముందుగా విచారించాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పిటిషన్లపై విచారణ జరుగుతున్నా కూడా కోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో కొనసాగుతుంది అని హైకోర్టు తెలిపింది.

ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానంలో విచారణ జరుగుతోంది, కీలకపత్రాలు పరిశీలన చేయాల్సి వస్తే ప్రత్యక్ష విచారణ జరిపే అవకాశముంది. పిటిషన్లు దాఖలు చేసిన వారిలో అమరావతి గ్రామాల రైతులు, సామాజిక కార్యకర్తలు, విపక్ష పార్టీలు, అమరావతి ఉద్యమకారులు ఉన్నారు. వీరితో పాటు వివిధ పార్టీలు కూడా తమ అభిప్రాయాలతో అఫిడవిట్లు దాఖలు చేశాయి. మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల సంఖ్య, వాటి తీవ్రత ఆధారంగా వీటిపై రోజువారీ విచారణ జరిపేందుకు హైకోర్టు గత నెలలోనే అంగీకారం తెలిపింది. కరోనా ప్రభావం కూడా తగ్గిన నేపథ్యంలో రోజువారీ విచారణకు ఆటంకాలు కూడా ఉండబోవని అంచనా వేస్తున్నారు.

మూడు రాజధానుల ఏర్పాటు కోసం గవర్నర్‌ సాయంతో ఆమోదించిన బిల్లులపై స్టేటస్‌ కో కొనసాగుతోంది. గవర్నర్‌ ఆమోదించిన ఈ బిల్లులు రాజ్యాంగబద్ధంగా రూపుదిద్దుకోలేదని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ బిల్లుల వ్యవహారం హైకోర్టు విచారణలో కీలకంగా మారబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రాజధానుల ఏర్పాటుకు తాను అనుకూలమని ఇప్పటికే అఫిడవిట్లు దాఖలు చేశాయి. అయితే విపక్షాలు మాత్రం తాము కొత్త రాజధానులకు వ్యతిరేకమంటూ అఫిడవిట్లు దాఖలు చేశాయి. విపక్షాలన్నీ రైతులకు మద్దతుగా నిలవడంతో ఈ వ్యవహారం చివరికి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.