Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల జ‌ర‌గ‌కుండానే ముగ్గురు గెలిచేశారు

By:  Tupaki Desk   |   29 March 2019 10:51 AM IST
ఎన్నిక‌ల జ‌ర‌గ‌కుండానే ముగ్గురు గెలిచేశారు
X
కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్ రాజ్ న‌టించిన సినిమాలో.. నేను మోనార్క్ నంటూ చెప్పిన డైలాగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అదే సినిమాలో నేనే ఇలా ఉంటే.. మా అక్క ఎలా ఉంటుందో ఆలోచించారా? అన్న డైలాగు ఎంత‌లా పేలిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

తాజా ఉదంతం వింటే.. ఈ డైలాగు చ‌ప్పున గుర్తుకు రావ‌ట‌మే కాదు.. ఏపీలో హ‌డావుడి చేస్తున్న ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గుర్తుకు వస్తారు. దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌.. త‌దిత‌ర‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

మిగిలిన రాష్ట్రాల్లో మాదిరే.. ఆయా రాష్ట్రాల్లో పోటాపోటీగా ఎన్నిక‌ల ప్ర‌చారం సాగుతోంది. పోటీ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇలాంటి వేళ‌.. ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్టం పోలింగ్ పూర్తి కాక ముందు ముగ్గురు అభ్య‌ర్థులు గెలిచిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకిలా అంటే.. మ‌న కేఏ పాల్ కు మించిన ముగ్గురు అభ్య‌ర్థుల కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌న్న ఆలోచ‌న ఉన్న‌ప్పుడు.. నామినేష‌న్ ప‌త్రాల్ని ప‌క్కాగా చూసుకోవ‌టం.. స‌మ‌యానికి వేసేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం ముఖ్యం. అయితే.. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు కేఏ పాల్ నామినేష‌న్ ప‌త్రాల్ని ప‌ట్టుకొని రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యంలోకి ప‌రిగెత్త‌టం.. టైం అయిపోయింద‌ని ఆయ‌న నామినేష‌న్ ను తిర‌స్క‌రించిన రీతిలోనే కాదు కానీ.. ఇంచు మించు అలాంటి సీన్ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది.

ఈ రాష్ట్రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీకి దిగాల్సిన ముగ్గురు ప్ర‌ధాన అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ ప‌త్రాల్ని స‌రిగా పూర్తి చేయ‌కుండా దాఖ‌లు చేశారు.

వీటిని స్క్రూట్నీ చేసిన అధికారులు.. నామినేష‌న్లు లోప‌భూయిష్టంగా ఉండ‌టంతో వారి నామినేష‌న్ల‌ను తిర‌స్క‌రించారు. వీరి నామినేష‌న్ల‌ను మిన‌హాయిస్తే.. బీజేపీ త‌ర‌ఫున నామినేష‌న్ వేసిన అభ్య‌ర్థి నామినేషన్ ఒక్క‌టే మిగిలింది. దీంతో.. ఎన్నిక‌ల అవ‌స‌రం లేని తేల్చిన అధికారులు.. స‌ద‌రు అభ్య‌ర్థి ఏక‌గ్రీవంగా గెలిచిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఇలా.. ఒక్క స్థానంలో కూడా ఏకంగా మూడు స్థానాల్లో ఇలాంటి ప‌రిస్థితి నెలకొంది. ప్ర‌త్య‌ర్థులు చేసిన త‌ప్పులు బీజేపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు వ‌రంగా మారి.. ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండానే ఎంచ‌క్కా ఎమ్మెల్యేలు అయిపోయిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఏమైనా కేఏ పాల్ కు మించిన వెర్ష‌న్లు పోటీలో ఉంటే.. ఇలాంటి సీన్లే ఆవిష్కృత‌మ‌వుతాయేమో. ఎన్నిక‌ల అవ‌స‌రం లేకుండా బీజేపీ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవ‌మైన స్థానాల్ని చూస్తే..

1. పశ్చిమ సియాంగ్‌ జిల్లాలోని తూర్పు స్థానం

2. లోయర్‌ సుబన్సిరి జిల్లాలోని యాచులి స్థానం

3. పశ్చిమ కమెంగ్‌ జిల్లాలోని దిరంగ్ స్థానం