Begin typing your search above and press return to search.

అంబానీ ప్రాణాల‌కు ముప్పు.. ఇంటి స‌మీపంలో పేలుడు ప‌దార్థాల క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   25 Feb 2021 4:30 PM GMT
అంబానీ ప్రాణాల‌కు ముప్పు.. ఇంటి స‌మీపంలో పేలుడు ప‌దార్థాల క‌ల‌క‌లం
X
అప‌ర కుబేరుడు ముఖేష్ అంబానీ ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డిందా? ఆయ‌న‌ను మ‌ట్టు బెట్టేందుకు `కొంద‌రు` ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు భ‌ద్ర‌తాధికారులు. ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతులైన తొలి ఐదుగురిలో ముఖేష్ ఒక‌రు. ఇక‌, దేశీయంగా చూసుకుంటే.. ఆయ‌న తొలి స్థానంలో నిలిచారు. దీనిపై వామ‌ప‌క్ష భావ జాలం ఉన్న వారు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దేశంలో పేద‌లు పెరుగుతుంటే.. అదేస‌మ‌యంలో ముఖేష్ అంబానీ వంటి వారు ల‌క్ష‌ల కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తుతున్నార‌నే వాద‌న ఉంది. అయితే.. తాజాగా ఆయ‌న ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌నే విష‌యం వెలుగు చూడ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ముంబైలోని ముఖేష్ అంబానీ అతిపెద్ద విల్లా వ‌ద్ద పేలుడు పదార్థాలతో ఉన్న కారును నిలిపార‌నే విష‌యం తెలియ‌డంతో దేశం ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. ముంబైలోని ఆయన ఇంటికి సమీపంలో ఆపి ఉన్న ఓ వాహనంలో పేలుడు పదార్థాలు ఉన్నాయ‌ని భ‌ద్ర‌తా సిబ్బందికి ఫోన్ వ‌చ్చింది. ముఖేష్ టార్గెట్ గా దీనిని ఏర్పాటు చేశార‌ని తెలియ‌డంతో ముంబై పోలీసులు హుటాహుటిన ఆయ‌న ఇంటిని చుట్టుముట్టారు. ఇంటికి సమీపంలో వాహనం ఆగి ఉండ‌డాన్ని గుర్తించారు. వెంట‌నే బాంబు నిర్వీర్య ద‌ళాన్ని రంగంలోకి దింపారు. త‌నిఖీ చేసిన బృందం ఆ వాహనంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.

దీంతో స‌ద‌రు వాహనం ఎక్కడిది? అక్కడికి ఎలా వచ్చింది? ఎవరిది? అనే విషయాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వాస్త‌వానికి ఈ ఏడాది మొద‌ట్లోనే నిఘా వ‌ర్గాలు అంబానీ కుటుంబానికి ముప్పు ఉంద‌ని కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న సొంత ఖ‌ర్చుతోనే భ‌ద్ర‌త ఏర్పాటు చేసుకున్నారు. త‌న‌కు జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ ఇవ్వాల‌ని ఆయ‌న ఇటీవ‌ల కోరినట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. దీనిపై కేంద్ర హోం శాఖ స‌మాలోచ‌న‌లు చేస్తోంది. ఇంత‌లోనే ఇంటి ముందు ఇలా పేలుడు ప‌దార్థాల‌తో కూడిన వ్యాన్ ఉండ‌డం.. ప్రాణాల‌కు ముప్పు ఉంద‌న్న నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ ఇస్తారో లేదో చూడాలి. ఏదేమైనా.. ముఖేష్ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ పారిశ్రామిక వేత్త‌ల‌కు గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించింద‌న‌డంలో సందేహం లేదు.