Begin typing your search above and press return to search.

ట‌మోటా ఫ్లూ ముప్పు వీరికే ఎక్కువ‌!

By:  Tupaki Desk   |   24 Aug 2022 2:06 PM IST
ట‌మోటా ఫ్లూ ముప్పు వీరికే ఎక్కువ‌!
X
మ‌న‌దేశంలో కేరళలో వెలుగు చూసిన టమోటా ఫ్లూ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఐదేళ్ల‌లోపు చిన్న‌ పిల్లలకే ఎక్కువని ప్రముఖ వైద్య పత్రిక 'ద లాన్సెట్‌' వెల్ల‌డించింది. ట‌మోటా ఫ్లూ నియంత్రించకుంటే పెద్దలకూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరిక‌లు జారీ చేసింది.

టమోటా ఫ్లూ లేదా టమోటా ఫీవర్‌ను ఈ ఏడాది మే 6న తొలిసారిగా కేరళలోని కొల్లం జిల్లాలో గుర్తించారు. జూలై 26 నాటికి 82 మంది చిన్నారులకు ఈ ఇన్‌ఫెక్షన్ సోక‌డం గ‌మ‌నార్హం. ఒడిశాలో 26మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరి వయసు ఐదేళ్ల లోపే. కేరళతోపాటు తమిళనాడు, హ‌రియాణాలోనూ ట‌మోటా ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ఈ వ్యాధిబారిన ప‌డ్డ‌వారికి బాగా దగ్గరగా రావడం వల్ల ఈ ఇన్‌ఫెక్షన్‌ వస్తుందని లాన్సెట్‌ కథనం వివ‌రించింది.

సురక్షితం కానీ వాటిని తాకడం, వస్తువులను నేరుగా నోట్లో పెట్టుకోవడం, నాపీల వినియోగం వంటి అలవాట్ల వల్ల పిల్లలకు ఈ ముప్పు ఎక్కువని లాన్సెట్ వెల్ల‌డించింది. టమోటా ఫ్లూ సోకినవారిలో జ్వరం, అలసట, ఒళ్లు నొప్పులు వంటి కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయ‌ని పేర్కొంది. అయితే ఈ ల‌క్ష‌ణాల‌కు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణం కాకపోవచ్చని అభిప్రాయ‌ప‌డింది. అవి ఇంత‌కుముందు చికెన్ గన్యా లేదా డెంగీ జ్వరం వంటివి వ‌చ్చి ఉంటే వాటి ప్రభావాల‌ని వెల్ల‌డించింది.

ట‌మోటా ఫ్లూ ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్ కాద‌ని తెలిపింది. అయితే కోవిడ్‌ అనుభవాల నేప‌థ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో మహమ్మారి విజృంభణకు అవకాశం ఇవ్వవ‌ద్ద‌ని కోరింది.
కాగా టమోటా ఫ్లూకి కరోనా వైరస్, మంకీపాక్స్, డెంగ్యూ, చికెన్ పాక్స్ లతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

పేగు సంబంధిత వ్యాధి కారణంగా సోకే ఈ టొమాటో ఫ్లూ ఓ అంటువ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లోనే ఇది వ్యాపిస్తుంద‌ని అంటున్నారు. పెద్ద‌ల‌కు దీన్ని తట్టుకునే రోగనిరోధక శక్తి ఉండటం వల్ల వారిపై ఈ వ్యాధి ప్రభావం చూపద‌ని పేర్కొంటున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధి సోకిన చిన్నారులకు జ్వరం, నోట్లో పుండ్లు, చేతులు, కాళ్లు, పిరుదులపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయ‌ని వివ‌రిస్తున్నారు. శరీరంపై ఎర్రగా నీటి బుడగల్లాగా ఏర్పడి, టొమాటో అంత పరిమాణంలో పెరిగిపోతాయి కాబట్టి ఈ వ్యాధికి ట‌మోటా ఫ్లూ అని పేరు పెట్టారు.