Begin typing your search above and press return to search.

భారత్‌ లో ముప్పు .. వెళ్తే తిరిగొస్తామనే నమ్మకంలేదు .. నోరు విప్పిన చోక్సీ

By:  Tupaki Desk   |   16 July 2021 8:30 AM GMT
భారత్‌ లో ముప్పు .. వెళ్తే తిరిగొస్తామనే నమ్మకంలేదు .. నోరు విప్పిన చోక్సీ
X
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ లో వేల కోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ. ఈ సారి మరో కథతో తెర మీదికి వచ్చారు. తాను నివసిస్తోన్న అంటిగ్వా అండ్ బార్బుడా నుంచి అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయిన ఆయన పొరుగుదేశం డొమినికాలో శరీరంపై గాయాలతో వెలుగులోకి వచ్చాడు. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడనే కారణంతో ఆయనను డొమినికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని డొమినికా న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీనితో అయన మళ్లీ అంటిగ్వాకు వెళ్లాడు. ఈ పరిణామాల మధ్య మేహుల్ చోక్సీ తొలిసారిగా స్పందించారు.

అంటిగ్వా అండ్ బార్బుడా నుంచి అదృశ్యమైనప్పటి నుంచి డొమినికా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం వరకు చోటు చేసుకున్న పరిణామాలపై అయన పలు విషయాల గురించి చర్చించారు. సరికొత్త ఆరోపణలను సంధించారు. భారత దర్యాప్తు సంస్థలు తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు చేశారు. ఎట్టకేలకు తాను అంటిగ్వాకు చేరుకున్నానని, ఈ రెండు నెలల కాలంలో సంభవించిన సవాళ్లు, తనను తీవ్రంగా గాయపరిచాయని, శారీరకంగా, మానసికంగా శాశ్వత గాయాలను మిగిల్చాయని వ్యాఖ్యానించారు. తన ఆస్తులు, వ్యాపారాలు అన్నీ సీజ్ అయ్యాయని, భారత దర్యాప్తు సంస్థలు తనను అపహరించడానికి ప్రయత్నించాయని అన్నారు.

బ్యాంకులను మోసగించిన కేసులో తనను అంటిగ్వా విచారణ జరపాలని సీబీఐ, ఈడీలను విజ్ఞప్తి చేసినట్లు మేహుల్ ఛోక్సీ చెప్పారు. తన ఆరోగ్యం బాగుండట్లేదని, ప్రయాణాలు సాగించడానికి శరీరం సహకరించట్లేదని అన్నారు. అందుకే తనను అంటిగ్వాలోనే విచారణ జరపాలని సీబీఐ, ఈడీలను పలుమార్లు కోరినట్లు చెప్పారు. అయినప్పటికీ, తనను అమానవీయంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాయని ఆరోపణలు చేశారు. భారత దర్యాప్తు సంస్థల నుంచి ఈ చర్యలను తాను ఏ మాత్రం ఊహించలేదని అన్నారు. భారత్‌లో తనకు ముప్పు పొంచివున్నట్లు భావిస్తున్నానని, తనకు భద్రత లేదని మేహుల్ చోక్సీ స్పష్టం చేశారు.అందుకే దర్యాప్తు సంస్థలు అంటిగ్వాలో తనను కస్టడీలోకి తీసుకుని, విచారణ జరిపించుకోవచ్చని అన్నారు. తాను మళ్లీ భారత్‌ కు వెళ్తే..సురక్షితంగా తిరిగి వస్తాననే నమ్మకం లేదని తేల్చి చెప్పారు. అంటిగ్వాలో దర్యాప్తును చేపట్టడానికి సహకరిస్తానని స్పష్టం చేశారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే గీతాంజలి గ్రూప్ కంపెనీలకు చెందిన రూ.14.45 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ చేసిన వాటిలో బంగారం, డైమండ్, ముంబైలోని ఫ్లాట్ ఉన్నాయి. ముంబై-గూర్గాన్‌ లోని 1460 స్క్వేర్ ఫీట్ల ఫ్లాట్‌తో పాటు బంగారం, ప్లాటినమ్ జ్యువెల్లరీ, డైమండ్, స్టోన్స్, పెరల్-సిల్వర్ నెక్‌ లెస్, వాచీలు, మెర్సిడెజ్ బెంజ్ కారు ఉన్నాయి. అటాచ్ చేసిన ఈ వస్తువులు గీతాంజలి గ్రూప్ కంపెనీలు లేదా మెహుల్ చోక్సీ పేరు మీద ఉన్నాయి. PNB చీటింగ్ కేసులో నీరవ్ మోడీతో పాటు మెహుల్ చోక్సీ నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈడీ ఇప్పటికే రూ.2,550 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మెహుల్ చోక్సీ ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉన్నాడు. అతనిని రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నీరవ్, చోక్సీ కలిసి పి ఎన్ బి కి రూ.13000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారు.