Begin typing your search above and press return to search.

కుమార‌స్వామికి ప‌ద‌వీ గండం ఖాయ‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   24 May 2018 4:31 AM GMT
కుమార‌స్వామికి ప‌ద‌వీ గండం ఖాయ‌మ‌ట‌!
X
పాలిటిక్స్ లో సెంటిమెంట్ల‌కు పెద్ద‌పీట వేస్తుంటారు. ఏదైనా త‌ల‌నొప్పి అన్న విష‌యంపై సందేహం ఉంటే.. దాని వ‌ర‌కూ వెళ్ల‌టానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు. కొన్ని దేవాల‌యాలు.. కొన్ని ప్ర‌ముఖ ప్ర‌దేశాల‌కు వెళితే.. ప‌ద‌వీచ్యుతి అన్న న‌మ్మ‌కాలు కొన్ని ఉంటాయి. ప్ర‌చారంలో ఉన్న ఇలాంటి న‌మ్మ‌కాల‌కు విలువ‌నిస్తూ.. వాటి జోలికి వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌రు.

కానీ.. కుమార‌స్వామి మాత్రం అలాంటి సాహ‌స‌మే చేశార‌ని చెబుతున్నారు. క‌ర్ణాట‌క‌లో ఉన్న సెంటిమెంట్ ప్ర‌కారం విధాన‌సౌధ ముందు ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ఏ ఒక్క‌రికి సంపూర్ణ కాలం రాజ్యాధికారం చేతిలో ఉండ‌ద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఆ మాట‌కు వ‌స్తే.. ఎవ‌రిదాకానో ఎందుకు కుమార‌స్వామికి సైతం సొంత అనుభ‌వం ఉంది.

గ‌తంలో ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారాన్ని విధాన‌సౌధ ముందు చేయ‌టం.. మ‌ధ్య‌లోనే సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌టం జ‌రిగింద‌ని చెబుతారు. బీజేపీ మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన స‌మ‌యంలో ఈ చేదు అనుభ‌వం కుమార‌స్వామికి ఉంది. అయిన‌ప్ప‌టికీ తాజాగా మ‌రోసారి విధాన‌సౌధ ముందు అర్భాటంగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. బుధ‌వారం అంగ‌రంగ వైభ‌వంగా సాగిన కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ మ‌హోత్సవానికి సోనియా.. రాహుల్ తో పాటు మ‌మ‌తా.. కేజ్రీవాల్‌.. చంద్ర‌బాబు ఇలా చాలామంది అధినేత‌లు హాజ‌ర‌య్యారు.

అయితే.. ఇంత ఆర్భాటంగా సాగిన ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వాన్ని విధాన‌సౌధ ముందు నిర్వ‌హించ‌టంపై ప‌లువురు ప‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త చ‌రిత్ర‌ను చూస్తే.. విధాన‌సౌధ ముందు ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ఏ ప్ర‌భుత్వం పూర్తికాలం పాటు పాలించ‌లేద‌ని.. ఏ ముఖ్య‌మంత్రి ప‌ద‌వీకాలం పూర్తి చేయ‌లేక‌పోయార‌ని చెబుతారు. ఈ లెక్క‌న కుమార‌స్వామికి ఈసారి సైతం ప‌ద‌వీ గండం పొంచి ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది.

గ‌త అనుభ‌వాల్ని చూస్తే..

+ 1993లో అప్ప‌టి జ‌నతాద‌ళ్ నేత రామ‌కృష్ణ హెగ్డే తొలిసారి విధాన‌సౌధ ముందు సీఎంగా ప్ర‌మాణం చేశారు. మ‌ద్యం కాంట్రాక్టుల ఆరోప‌ణ‌ల‌తో ఏడాదిలోపే సీఎం ప‌ద‌విని కోల్పోయారు.

+ అదే ఏడాది హెగ్డే మ‌రోసారి సీఎంగా ప్ర‌మాణం చేసినా ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌ల‌తో మ‌ళ్లీ ప‌ద‌వి పోగొట్టుకున్నారు

+ విధాన‌సౌధ ద‌గ్గ‌ర సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన బంగార‌ప్ప (1990) కూడా పూర్తికాలం ప‌ద‌విలో ఉండ‌లేదు. కావేరీ జ‌లాల విష‌య‌మై రాష్ట్రంలో అల్ల‌ర్లు చెల‌రేగ‌టంతో రెండేళ్ల‌లోనే ఆయ‌న త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.

+ ఇప్ప‌టి మాదిరే విధాన‌సౌధ ద‌గ్గ‌ర బీజేపీ మ‌ద్ద‌తుతో 2006లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమార‌స్వామి 20 నెల‌లు మాత్ర‌మే ముఖ్య‌మంత్రిగా ఉండ‌గ‌లిగారు

+ 2008లో క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో హంగ్ అసెంబ్లీ ఏర్ప‌డ‌గా.. య‌డ్యూర‌ప్ప నేతృత్వంలో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంద‌ర్భంగా విధాన‌ సౌధ ఎదుట భారీ ఎత్తున ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలోనూ.. య‌డ్యూర‌ప్ప మూడేళ్లకే అవినీతి ఆరోప‌ణ‌ల‌తో సీఎం ప‌ద‌విని పోగొట్టుకున్నారు.