Begin typing your search above and press return to search.

రైతన్నకు కడుపు మండింది..ఢిల్లీకి నడక మొదలెట్టారు

By:  Tupaki Desk   |   21 Sep 2019 2:30 PM GMT
రైతన్నకు కడుపు మండింది..ఢిల్లీకి నడక మొదలెట్టారు
X
దేశానికి అన్నం పెట్టే అన్నదాతలైన రైతులకు కడుపు మండింది. సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించకపోవటంతో వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెరుకు రైతుల బకాయిల్ని చెల్లించటంతో పాటు ఉచితవిద్యుత్ లాంటి 16 హామీల్ని తీర్చాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. యూపీ నుంచి నడుచుకుంటూ వస్తున్న వారిని.. నోయిడాలో వ్యవసాయ శాఖాధికారులు చర్చలు జరిపారు.

సెప్టెంబరు 11న మొదలైన ఢిల్లీకి పాదయాత్ర ప్రోగ్రాం ఇప్పుడు జోరుగా సాగుతోంది. నోయిడాలో చర్చలు విఫలమైన నేపథ్యంలో తమ నిరసనను తెలియజేసేందుకు దేశ రాజధానికి ఉప్పెనలా తరలి వస్తున్నారు. వీరి రాకతో జాతీయ రహదారి 24 మీద పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.

వేలాదిగా పాదయాత్ర చేస్తున్న రైతుల కారణంగా జాతీయ రహదారి తీవ్రమైన ట్రాఫిక్ జాం సమస్యను ఎదుర్కొంటోంది. రైతుల పాదయాత్రను కేంద్రంలోని మంత్రులతో సహా.. ఎవరూ సీరియస్ గా తీసుకోకపోవటం.. వారు పట్టుదలతో సాగుతున్న తీరు.. ఇప్పుడు జాతీయ మీడియాలో ప్రాధాన్యత లభిస్తోంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ శివారులోనే వారిని నిలువరించి.. చర్చలు జరిపి.. వారిని వెనక్కి పంపాలని ఢిల్లీ పోలీసులు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. మరి.. ఆ సందర్భంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు సందేహంగా మారింది. అయినా.. పారిశ్రామిక ఉద్దీపన కోసం లక్షల కోట్ల రూపాయిల్ని ప్రకటించే కేంద్రం.. ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్న రైతుల సమస్యల్ని ఎందుకు పరిష్కరించకుండా ఉంటున్నట్లు..?