Begin typing your search above and press return to search.

హాంకాంగ్ లో రచ్చ ఇప్పుడు మామూలుగా లేదట!

By:  Tupaki Desk   |   3 July 2020 12:30 AM GMT
హాంకాంగ్ లో రచ్చ ఇప్పుడు మామూలుగా లేదట!
X
సరిహద్దు దేశాలతోనే కాదు.. తనకున్న అధికారాలతో ఎవరినైనా సరే.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే ధోరణి చైనాకు కొత్త కాదు. ఆ దేశంతో సరిహద్దులు పంచుకునే ప్రతి దేశంతోనూ ఏదో ఒక పంచాయితీ అన్నది తెలిసిందే. అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా పాక్షిక స్వయంప్రతిపత్తి ఉన్న హాంకాంగ్ పై చైనా నిర్ణయాలు అక్కడి ప్రజలకు మండేలా చేస్తున్నాయి. చైనా వ్యతిరేక నిరసనలకు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వస్తున్నారు.

తమ దేశ స్వాతంత్య్రాన్ని హరించొద్దంటూ డిమాండ్ చేస్తూ 300మంది హాంకాంగ్ వాసులు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేపట్టారు. వీరిలా నిరసన చేయటానికి కారణం లేకపోలేదు. హాంకాంగ్ కోసం చైనా ప్రభుత్వం ఒక వివాదాస్పద చట్టాన్ని తీసుకొచ్చింది. జాతీయ భద్రత చట్టం పేరుతో అమల్లోకి వచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళన చేపట్టారు. వాస్తవానికి ఈ చట్టాన్ని హాంకాంగ్ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తాజాగా సంతకం చేసిన ఈ చట్టం.. మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. మరో కీలకమైన విషయం ఏమంటే.. ఈ కొత్త చట్టం ప్రకారం ఎవరైనా నిరసనలు చేపడితేవారిని అరెస్టు చేయటంతో పాటు.. యవజ్జీవ కారాగారశిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. అంత కఠినమైన చట్టాన్ని తాజాగా తీసుకురావటం వెనుక అసలు ఉద్దేశం ఆందోళనల్ని తీవ్రంగా అణిచివేయటంగా చెబుతున్నారు.

గడిచిన 24 గంటల్లో ఈ కొత్త చట్టం కింద పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు. సుమారు 300 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. వీరికి తీవ్ర నేరాలు చేసిన నేరం కింద విచారిస్తారు. యావజ్జీవ కారాగార శిక్ష విధించే వీలుంది. కొత్త చట్టంతో పదునెక్కిన కోరలతో విరుచుకుపడే వేళలో.. తమ హక్కుల కోసం డిమాండ్లు చేసే హాంకాంగ్ వాసులకు వచ్చేకష్టాలు ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు.