Begin typing your search above and press return to search.

వెయ్యి మందికి పర్మిషన్ ఇస్తే లక్ష మంది వచ్చారా?

By:  Tupaki Desk   |   5 Jan 2020 6:52 AM GMT
వెయ్యి మందికి పర్మిషన్ ఇస్తే లక్ష మంది వచ్చారా?
X
పౌరసత్వ సవరణ చట్టంతో పాటు.. ఎన్నార్సీ.. ఎన్నార్పీలకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ నగరాల్లో ఆందోళనలు..నిరసనలు వ్యక్తమవుతున్నా హైదరాబాద్ లో మాత్రం అందుకు భిన్నంగా భారీ ఆందోళనలు ఎక్కడా చోటు చేసుకోలేదు. ఈ అంశంపై చాలామంది ఆశ్చర్యపోయే పరిస్థితి. మైనార్టీలకు ఇబ్బంది కలిగిస్తుందన్న వాదన వినిపించే ఈ అంశాల మీద హైదరాబాద్ లో ఎందుకని ఆందోళనలు చోటు చేసుకోవటం లేదన్న ప్రశ్నకు సమాధానం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న అభిప్రాయం కూడా ఉంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఫోన్ చేసి.. నిరసనలు.. ఆందోళనల పేరుతో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరటం.. తమ మధ్య ఉన్న స్నేహంతో ఆయన ఓకే చెప్పినట్లుగా చెబుతారు. దీనికి తగ్గట్లే.. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే హైదరాబాద్ లో మాత్రం అలాంటిదేమీ కనిపించని పరిస్థితి.

ఇలాంటివేళ.. శనివారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇందిరాపార్కు వద్ద తెలంగాణ.. ఏపీ జేఏసీ.. తెహరీక్ ముస్లిం షబ్బాన్ సంయుక్త ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ ను నిర్వహించారు. ఈ సభ కోసం కోర్టును ఆశ్రయించగా.. వెయ్యి మంది హాజరయ్యే సభను నిర్వహించేందుకు వీలుగా పర్మిషన్ ఇచ్చారు. ఎవరూ ఊహించని రీతిలో.. ఈ సభ కోసం శనివారం మధ్యాహ్నం దాదాపు లక్ష మంది (ఒక అంచనా ప్రకారం) చేరుకోవటంతో అందరూ అవాక్కు అయ్యే పరిస్థితి. పోలీసులకైతే దిక్కుతోచని పరిస్థితి.

అసలేం జరుగుతుందో తెలుుకునే లోపే.. ఇందిరాపార్కుకు వచ్చే దారులన్ని జన సంద్రాలుగా మారిపోయాయి. దీంతో.. పోలీసులు చేష్టలుడిగిపోయినట్లుగా ఉండిపోయారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇంత భారీగా నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చినా.. ఒక్కటంటే ఒక్క ఘటన కూడా చోటు చేసుకోకకుండా ప్రశాంతంగా కార్యక్రమం ముగియటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ.. ఏ ప్రధాన రాజకీయ పార్టీ లేకుండా కేవలం కొన్ని సంస్థలతోనే ఇంత భారీ ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చారా? అన్నది ప్రశ్నగా మారింది.

అయితే.. జనసమీకరణ కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగటంతో పాటు.. కొన్ని సంస్థలు తీసుకున్నప్రత్యేక శ్రద్ధతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఇంతకాలం హైదరాబాద్ మహానగరంలో నిరసనలు లేకుండా పోయాయన్న కొరతను తీర్చేలా శనివారం నాటి మిలియన్ మార్చ్ చోటు చేసుకుందని చెప్పక తప్పదు.