Begin typing your search above and press return to search.

ఆయనకు ప్యాకేజీ..ఆమెది ప్రత్యేక హోదా

By:  Tupaki Desk   |   16 Sept 2016 12:15 PM IST
ఆయనకు ప్యాకేజీ..ఆమెది ప్రత్యేక హోదా
X
ఏపీలో ప్రత్యేక హోదాపై ప్రజల్లో రగులుతున్న సెంటిమెంటు.. హోదా సాధించలేని చేతకానితనం మధ్య టీడీపీ ఎంపీలు ఇరకాటంలో పడుతున్నారు. దీంతో వారు తమ బుర్రలోని తెలివితేటలన్నీ బయటపెట్టి ప్రజలను మభ్య పెట్టే అస్త్రాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే టీడీపీ ఎంపీ తోట నరసింహం జనం ఏమనుకుంటారన్నది కూడా పక్కనపెట్టి ప్రత్యేక హోదా అంశంలో డబుల్ గేమ్ మొదలుపెట్టారు. ఆ ఆటలో తన సతీమణిని కూడా భాగస్వామిని చేశారు.

కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించడంతో ఎంపీలంతా ఆయన బాటే పట్టారు. వారూ ప్యాకేజీకి జై కొట్టారు. కానీ... జనం తమను ఛీ కొడుతుండడంతో నియోజకవర్గాల్లో మాత్రం ప్రత్యేక హోదా గళం విప్పుతున్నారు. అయితే, తామే నేరుగా ఆ మాటెత్తితే చంద్రబాబు పిలిచి క్లాసు పీకుతారు కాబట్టి కొందరు ఎంపీలు తెలివిగా రూటు మార్చి జనాన్ని మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీ తోట నరసింహం ప్యాకేజ్‌ సూపర్ అంటుంటే ఆయన భార్య తోట వాణి మాత్రం ప్రత్యేక హోదా కోసం లలితా సహస్రనామ పారాయణం మొదలుపెట్టారు.

శుక్రవారం కాకినాడలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. అక్కడి టీటీడీ కల్యాణ మండపంలో ఎంపీగారి సతీమణి తలపెట్టిన ప్రత్యేక హోదా సాధన లలితా సహస్రనామ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో తోట దంపతుల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఈ కార్యక్రమం చేస్తున్నట్టు వాటిపై రాశారు. దీంతో జనం సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.