Begin typing your search above and press return to search.

హెల్మెట్ లేకపోతే ఇక మీ పని ఖతమే

By:  Tupaki Desk   |   5 Nov 2020 9:20 PM IST
హెల్మెట్ లేకపోతే ఇక మీ పని ఖతమే
X
కేంద్రం చట్టం చేసి అమలు చేస్తున్న కొత్త వాహనచట్టం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తప్పు చేసిన వారికి విధిస్తున్న ఫైన్లు ఠారెత్తిస్తున్నాయి. అప్పట్లో ఓ బైకర్ కు రూ.27వేల ఫైన్ వేశారు. అది మరిచిపోకముందే ఓ లారీ డ్రైవర్ కు 80వేల ఫైన్ వేశారు. దేశంలోనే ఇప్పటివరకు ఇదే అత్యధికం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ చట్టం అమలు కాగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతీయ పార్టీలున్న రాష్ట్రాల్లోనూ అమలుకు రంగం సిద్ధం అవుతోంది.

ఇది చూసి జనాలు షాక్ అవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలతో ఇప్పుడు రోడ్డుమీదకు రావాలంటేనే జనాలు హడలి చస్తున్నారు. హెల్మెట్ సహా అన్ని పత్రాలు తీసుకొనే రోడ్డెక్కుతున్నారు. ఇప్పుడు దేశంలోనే ఇంత భారీ ఫైన్ చూశాక ఇక మరింత అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ భారీ ఫైన్లు అమలు కాలేదు. చట్టం అమలును తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా అమలు చేయకపోవడంతో ఫైన్లు ఇప్పటివరకు భారీగా పడడం లేదు. మనకూ కూడా మొదలైతే ఇక వాహనదారులకు దబిడదిబిడే..

ఈ భారీ ఫైన్లు చాలవంటూ చావుకబురును కేంద్రం చల్లగా చెప్పింది. ఇకపై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. రెండోసారి హెల్మెట్ లేకుండా దొరికితే లైసెన్స్ జీవితకాలం రద్దు చేయనున్నారు.

ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ , ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్ లకు ఈ నిబంధనలు వర్తింపచేస్తున్నారు. ఈ మేరకు మోటార్ వాహనాల చట్టం 206 కింద కేంద్రం మార్పులు చేసింది. దీంతో ఇక వాహనదారులు రోడ్డుమీదకు వచ్చే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా మరిచిపోయి తప్పు చేశారో బుక్ అయినట్టే.. ఇప్పటికే తెలంగాణలోని సైబరాబాద్ లో ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు.