Begin typing your search above and press return to search.

ఆ రెండు టీకాల సామర్థ్యం 6 నెలలే

By:  Tupaki Desk   |   26 Aug 2021 9:30 AM GMT
ఆ రెండు టీకాల సామర్థ్యం 6 నెలలే
X
కరోనా మహమ్మారి విజృంభణ కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మన ముందున్న ఏకైక మార్గం. దీనితో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రకరకాల వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఈ తరుణంలో మరో వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్, బ్రిటన్‌ యూనివర్సిటీ ఆక్స్‌ఫర్డ్‌– ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ల సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న తర్వాత అయిదు నుంచి ఆరు నెలల్లోగా దాని సామర్థ్యం 88% నుంచి 74 శాతానికి పడిపోయినట్టు బ్రిటన్‌ కు చెందిన జోయి కోవిడ్‌ అనే సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఇక ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ సామర్థ్యం నాలుగైదు నెలల్లోనే 77 శాతం నుంచి 67 శాతానికి పడిపోయినట్టుగా ఆ అధ్యయనం తెలిపింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ను భారత్‌ లో సీరమ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ కోవిషీల్డ్‌ పేరుతో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. 12 లక్షలకిపైగా కరోనా పరీక్షలు నిర్వహించి, దాని డేటా ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు.

అంతకు ముందు జరిగిన అధ్యయనాల్లో కరోనా వ్యాక్సిన్‌ సామర్థ్యం కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుందని వెల్లడైంది. వయసులో పెద్దవారు, ఆరోగ్య రంగంలో పని చేస్తున్న వారిలో వ్యాక్సిన్‌ సామర్థ్యం 50 శాతానికి కూడా పడిపోవచ్చునని ఆ అధ్యయనం తెలిపింది. మనం ఇక చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఒకవైపు వ్యాక్సిన్‌ సామర్థ్యం పడిపోతుంటే మరోవైపు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది అని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టిమ్‌ స్పెక్టర్‌ అన్నారు

కరోనా రెండు డోసుల వ్యాక్సిన్‌ లతో పాటు కొంత విరామంలో బూస్టర్‌ డోసు ఇవ్వాలని ఇప్పటికే ఎందరో శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. తాజాగా వీటి సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తేలిన నేపథ్యంలో బూస్టర్‌ డోసుల ఆవశ్యకత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బూస్టర్‌ డోసులు ఇవ్వడం అత్యవసరమని ప్రొఫెసర్‌ స్పెక్టర్‌ అన్నారు. ఇక మన దేశంలో నిన్న 80,40,407 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 60,38,46,475 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.