Begin typing your search above and press return to search.

ఏపీ హైకోర్టు కదిలిపోయేలా చేసిన ఆ ఇద్దరు వృద్ధులు

By:  Tupaki Desk   |   8 Dec 2020 11:00 AM IST
ఏపీ హైకోర్టు కదిలిపోయేలా చేసిన ఆ ఇద్దరు వృద్ధులు
X
న్యాయస్థానాలకు కేసులు రావటం.. వాటి విచారణకు ఆలస్యం కావటం మామూలే. అందుకు భిన్నంగా ఇద్దరు పెద్ద వయస్కులు దాఖలు చేసిన ఒక వ్యాజ్యం ఏపీ హైకోర్టును కదిలించింది. స్పష్టమైన ఆదేశాల్ని కింది కోర్టుకు జారీ చేసింది. పెద్ద వయస్కుల్ని గౌరవించటం అంటే.. బస్సుల్లోనూ.. రైళ్లలోనూ రాయితీలు ఇవ్వటంతో సరిపోదని.. కోర్టుల్లో ఉన్న కేసుల్ని త్వరగా పరిష్కరిస్తేనే.. వారిని గౌరవించినట్లుగా పేర్కొంది.

సహేతుకమైన కారణాలు లేకుండానే గడిచిన పదేళ్లుగా పరిష్కారం కాని ఇద్దరు వృద్ధుల పిటిషన్ ను వెంటనే పర్కిష్కరించాలని.. అందుకు రెండు నెలలు గరిష్ఠ సమయాన్ని కింది కోర్టుకు ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఆ ఇద్దరు వృద్ధులు ఇబ్బంది పడుతున్న కేసు ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఒక ఇంటి విషయంలో కింది కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని.. దాని ప్రకారం తమకు రావాల్సిన ప్రయోజనాల్ని మదింపు చేసేందుకు వీలుగా అడ్వొకేట్ కమిషన్ ను నియమించాలని కోరుతు 80 ఏళ్ల క్రిష్ణమూర్తి.. 72 ఏళ్ల ఉదయ్ ప్రభాకర్ శర్మలు 2011లో విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేవారు.

అప్పటి నుంచి వారి కేసు పెండింగ్ లో ఉంది. దీంతో.. వారు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. తమ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించేలా చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పిటిషనర్లు ఇద్దరు వయో వృద్ధులు. కింది కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పు ఫలాల్ని తాము బతికి ఉన్నప్పుడే అస్వాదిస్తామన్న ఆశతో హైకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనను సానుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రకారం 65 ఏళ్లకు పైబడిన వారి కేసుల్ని గుర్తించి.. వాటిని ప్రాధాన్యత క్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరించాలని 1999, 2003, 2014ల్లో హైకోర్టు సర్క్యులర్లను జారీ చేసినా వృద్ధుల కేసులు తగ్గటం లేదు’’ అని పేర్కొంది.

అంతేకాదు.. కింది కోర్టు తీర్పు ప్రకారం వారికి రావాల్సిన ప్రయోజనాల్ని లెక్క వేసేందుకు అడ్వొకేట్ కమిషన్ వేయాలని పిటిషన్ దాఖలు చేస్తే ఇప్పటివరకు పెండింగ్ లో ఉంచటం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇద్దరు పెద్ద వయస్కుల విషయంలో హైకోర్టు స్పందించిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.