Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్‌ ఓపెనింగ్ సెర్మనీకి ఆ భారత అథ్లెట్లు డుమ్మా ... లిస్ట్ ఇదే , ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   23 July 2021 9:30 AM GMT
ఒలింపిక్స్‌ ఓపెనింగ్ సెర్మనీకి ఆ భారత అథ్లెట్లు డుమ్మా ... లిస్ట్ ఇదే , ఏమైందంటే ?
X
జపాన్‌ రాజధాని టోక్యోలో విశ్వ క్రీడా సంరంభం ప్రారంభం అయింది. ఆ దేశ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రతిష్ఠాత్మకమైన ఈ స్పోర్ట్స్ ఈవెంట్ గ్రాండ్‌ గా ప్రారంభమైంది. రాజధాని టోక్యో సహా ఎంపిక చేసిన నగరాల్లో ఈ ఈవెంట్స్ కొనసాగుతోన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులను అనుమతించట్లేదు. ప్రస్తుతం అర్చరీ ఈవెంట్ కొనసాగుతోంది. మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ అర్చరీ లో దీపికా కుమారి పాల్గొంటోన్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి ఆమె తొమ్మిదవ స్థానంలో నిలిచారు.

కాగా, ఈ సాయంత్రం ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా మార్చ్ పాస్ట్ నిర్వహిస్తారు. దీనికి ఏస్ బాక్సర్ మేరీకోమ్, హాకీ ప్లేయర్ మన్‌ ప్రీత్ సింగ్ సారథ్యాన్ని వహిస్తారు. భారత జాతీయ పతకాన్ని జట్టును ముందుండి నడిపిస్తారు. ఒలింపిక్స్‌ లో పాల్గొనే అన్ని దేశాలు మార్చ్‌ పాస్ట్‌ కు హాజరవుతాయి. ఒలింపిక్స్‌ లో భారత్ తరఫున మొత్తం 127 మంది అథ్లెట్లు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నప్పటికీ.. వారందరూ మార్చ్‌ పాస్ట్‌ లో పాల్గొనట్లేదు. 20 మంది క్రీడాకారులు మాత్రమే దీనికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు డుమ్మా కొట్టనున్నారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమెతో పాటు పలువురు కీలక షూటర్లు కూడా దీనికి హాజరు కావట్లేదు. పీవీ సింధు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం, శనివారం ఆమె మ్యాచ్‌ ఆడాల్సి ఉండటమే.

మార్చ్‌ పాస్ట్‌ లో సుతీర్థ ముఖర్జీ, మణికా బాత్రా, జీ సత్యన్, శరద్ కమల్ టేబుల్ టెన్నిస్, కేసీ గణపతి, వరుణ్ అశోక్, విష్ణు శరవణ్, నేత్ర కుమనన్-సెయిలింగ్, భవానీ దేవి-ఫెన్సింగ్, ప్రణతి నాయక్-జిమ్నాస్టిక్స్, సజన్ ప్రకాష్-స్విమ్మింగ్, సిమ్రన్‌జిత్ కౌర్, లవ్లినా బీ, పూజారాణి, అమిత్, మనీష్ కౌశిక్, సతీష్ కుమార్, మేరీకోమ్-బాక్సింగ్, మన్‌ప్రీత్ సింగ్- హాకీ పాల్గొంటారు. జపాన్ ఆల్ఫాబీటికల్ ప్రకారం..ఈ మార్చ్‌ పాస్ట్ క్రమసంఖ్యలో భారత స్థానం 21. కరోనా నిబంధనల నేపథ్యంలో ఆరుమంది అధికారులు మాత్రమే మార్చ్‌ పాస్ట్‌ లో పాల్గొనడానికి అనుమతి లభించింది.

ప్రతీసారి అభిమానుల కోలాహలం మధ్య సందడిగా జరిగే ఈ మెగా ఈవెంట్ ఈసారి అనేక ఆంక్షల మధ్య ఫ్యాన్స్ లేకుండానే మొదలైంది. ఉదయం 5.30 గంటలకు ఆర్చరీలో మహిళల వ్యక్తిగత క్వాలిఫికేషన్ రౌండ్ మొదలైంది. ఇటీవల జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌లో సత్తా చాటిన ఆర్చర్ దీపికా కుమారి ఒలింపిక్స్‌లో తొలుత తడబడినా ఆరో సెట్‌లో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్ దీప్ భారత్ తరపున నిలిచారు. ఈ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్ ఉదయం 9.30 నుంచి మొదలుకానుంది. ఇక భారత స్టార్ బాక్సర్, ప్రపంచ నెంబర్ వన్ అమిత్ పంగల్‌కు తొలి రౌండ్‌ లోనే బై లభించింది. గురువారం బాక్సింగ్ డ్రా వెల్లడించగా అతడితో పాటు సతీష్ కుమార్(+91 కేజీ), ఆశిష్ చౌదరి(75 కేజీ), మనీశ్ కౌశిక్(63 కేజీ)లకు బై లభించింది. మహిళా బాక్సర్లలో ల్వీనా బొర్గోహైన్(69 కేజీ)లకు, సిమ్రన్‌ జిత్ కౌర్ (60కేజీ)లకు కూడా బై లభించింది.

ఇకపోతే , సృజనాత్మకత, నవ్యతకు జపాన్‌ పెట్టింది పేరు. ప్రపంచమంతా ఒకదారిలో ఉంటే, జపాన్‌ దానికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని, విజయం సాధించి చూపుతుంది. విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌ నిర్వహణలోనూ జపాన్‌ అదే మార్గంలో పయనిస్తోంది. క్రీడా గ్రామాన్ని రూపొందించడం దగ్గరి నుంచి పతకాల తయారీ వరకు వినూత్న మార్గాలను ఎంచుకుంది. ఆధునికతను, సంప్రదాయాన్ని జోడించి పతకాలను తయారు చేసింది. పర్యావరణ హితానికి కూడా ఇందులో పెద్దపీట వేసింది. ఒలింపిక్స్‌ మెడల్స్‌ను వినూత్న రీతిలో తయారు చేయాలని ముందే నిర్ణయించుకున్న జపాన్‌ అందుకోసం మూడేళ్ల నుంచే దేశ వాసుల నుంచి పాత మొబైల్‌ ఫోన్లను సేకరించింది. అందులో నుంచి లోహ విడిభాగాలను వేరు చేసి వాటిని కరిగించి మెడల్స్‌ ను తయారు చేశారు. ఆధునాతన కంప్యూటర్‌ డిజైన్లతో . అత్యంత అద్భుతంగా పతకాలను రూపొందించారు. దీని ద్వారా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్‌ చెత్త . మహత్తరమైన కార్యక్రమానికి పనికొచ్చినట్లైంది.

టోక్యో ఒలింపిక్స్‌ పలు రకాలుగా ప్రాధాన్యత సంతరించుకుంది. 33 విభాగాల్లో 339 ఈవెంట్లు జరగబోతున్నాయి. కొత్తగా ఐదు విభాగాలను ఈసారి ప్రవేశపెట్టారు. సర్ఫింగ్‌, స్కేట్‌ బోర్డింగ్‌, స్పోర్ట్స్‌ క్లైంబింగ్‌, కరాటే, బేస్‌బాల్‌ క్రీడలను ఒలింపిక్స్‌లో భాగంగా మార్చారు. ఇటీవలి కాలంలో రద్దయిన టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌, జూడో మిక్స్‌డ్‌ టీమ్‌ను పునరుద్దరించారు. స్విమ్మింగ్‌ పోటీల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇంకా పలు క్రీడల్లో కూడా మార్పులు చేశారు. ఈ నెల 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో 205 దేశాల నుంచి 11వేలకు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరందరికీ జపాన్‌ ప్రభుత్వం టోక్యోలో అన్ని వసతులతో క్రీడా గ్రామాన్ని నిర్మించింది.