Begin typing your search above and press return to search.

క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు ఆహ్వానం అందని ఆ 3 దేశాలు

By:  Tupaki Desk   |   14 Sep 2022 4:46 AM GMT
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు ఆహ్వానం అందని ఆ 3 దేశాలు
X
70 ఏళ్లు పాటు బ్రిటన్ దేశానికి రాణిగా వ్యవహరించిన ఎలిజబెత్ 2 ఇటీవల మరణించటం తెలిసిందే. ఆమె అంత్యక్రియలు అత్యంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఆ దేశ సర్కారు సిద్ధమవుతోంది. ఆమె అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ప్రపంచ దేశాలకు ఆహ్వానం పంపారు. అయితే.. మూడు దేశాలకు మాత్రం ఆ ఆహ్వానం అందలేదు. ఈ అంత్యక్రియలకు దాదాపు 500 మంది ప్రముఖులు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు.

ఇంతకీ బ్రిటన్ పక్కన పెట్టిన ఆ మూడు దేశాలేవంటే.. ఉక్రెయిన్ మీద దాడికి పాల్పడిన రష్యా.. ఆ దేశానికి మద్దతుగా నిలిచిన బెలారస్ తో పాటు.. నియంతలుగా సుపరిచితులైన మయన్మార్ దేశాల ప్రతినిధులను కూడా ఆహ్వానించలేదు.

మయన్మార్ లో అక్కడి సైన్యం తిరుగుబాటు చేసి అధికారం చేపట్టిన కారణంగా ఆ దేశంతో బ్రిటన్ దౌత్య సంబంధాలు కొనసాగించేందుకు సిద్ధంగా లేదని చెబుతున్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియులు సెప్టెంబరు 19న భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1965లో విన్ స్టన్ చర్చిల్ మరణం తర్వాత ఈ స్థాయిలో చేస్తున్న కార్యక్రమం ఇదే కావటం గమనార్హం.

మరో ఐదు రోజుల్లో నిర్వహించే ఈ అంత్యక్రియలకు వివిధ దేశాల అధినేతలు.. రాజులు.. రాణులు.. కలిపి మొత్తంగా 500 మంది వీవీఐపీలు హాజరు కానున్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కూడా ఉన్నారు.

క్వీన్ ఎలిజబెత్ 2కు నిర్వహిస్తున్న అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు న్యూజిలాండ్.. కెనడా.. ఆస్ట్రేలియా ప్రధానమంత్రులు.. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు.. జర్మనీ అధ్యక్షుడు హాజరు కానున్నారు. బెల్జియం.. స్వీడన్.. నెదర్లాండ్స్.. స్పెయిన్ దేశాల రాజులు.. రాణులు కూడా హాజరు కానున్నారు.

ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిధులతో ప్రిన్స్ చార్లెస్ ఆదివారం సాయంత్రం సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం వెస్ట్ మినిస్టర్ అబ్బే నుంచి విండరస్ క్యాజిల్ లోని సెయింట్ జార్జ్ చాపెల్ వరకు క్వీన్ ఎలిజబెత్ 2 అంతిమయాత్ర కొనసాగనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.