Begin typing your search above and press return to search.

ప్రియాంక పోటీచేసే నియోజకవర్గం ఇదేనా ?

By:  Tupaki Desk   |   16 Sept 2021 10:58 AM IST
ప్రియాంక పోటీచేసే నియోజకవర్గం ఇదేనా ?
X
కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయబోతున్నారా ? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వచ్చే ఏడాదిలో జరగబోతున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రియాంక అలుపెరగకుండా పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తేవటమే టార్గెట్ గా ప్రియాంక బాగా కష్టపడుతున్నారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల స్థాయిల్లో నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా తొందరలోనే రాష్ట్రమంతా పాదయాత్ర చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. పాదయాత్ర చేసినా చేయకపోయినా ఏదో ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని ఒక్కసారిగా ప్రచారం పెరిగిపోతోంది. ప్రియాంక సీఎం అభ్యర్థిగా ప్రొజెక్టు చేస్తే ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయని సీనియర్ నేతలంతా గట్టిగా పట్టుబడుతున్నారు. ఎలాగూ సీఎం అభ్యర్ధిగా ప్రచారం చేసేటపుడు ఏదో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే సరిపోతుందనే డిమాండ్లు కూడా పెరిగిపోయాయి.

ఇందులో భాగంగానే రాయబరేలి కానీ లేకపోతే అమేథీ లోక్ సభ నియోజకవర్గాల్లోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ నేతలంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాలపైనే ఎందుకింతగా చర్చ జరుగుతోంది ? ఎందుకంటే ఈ రెండు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోనే ప్రియాంక ఎక్కువగా దృష్టి పెట్టి తిరుగుతున్నారట. పైగా ఈ రెండు లోక్ సభ నియోజకవర్గాలతో దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రత్యేకించి గాంధి కుటుంబానికి విడదీయలేని సంబంధాలున్నాయి.

అమేథీ లోక్ సభ ఎన్నికల్లో మొన్న రాహుల్ గాంధీ ఓడిపోయారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాటలు, రాహుల్ జాతీయస్థాయిలో పర్యటించిన కారణంగా తన నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేక పోయిన కారణంగా ఓడిపోయారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని తిరిగి పార్టీ గెలుచుకోవాలంటే ప్రియాంక లాంటి బలమైన నేత ఇక్కడ ఉండాల్సిందే అని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. మొత్తానికి ప్రియాంక కనుక ఏదో ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే రికార్డు అవుతుంది. ఎందుకంటే గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న మొదటి వ్యక్తి ప్రియాంకే అవుతుంది కాబట్టి.