Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం గంటాకు షాక్...మ్యాటరేంటి అంటే....?

By:  Tupaki Desk   |   11 March 2023 2:31 PM GMT
ఫస్ట్ టైం గంటాకు షాక్...మ్యాటరేంటి అంటే....?
X
విశాఖ జిల్లాలో తిరుగులేని నేతగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన తెలుగుదేశం రాజకీయాల్లో పాతికేళ్ళుగా కొనసాగుతున్నారు. ఆయన ఏడేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఉన్నారు. గంటా విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకునే మాట ఒకటి ఉంది.

ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు అని. దానికి రుజువుగా 2019 ఎన్నికల్లో గంటా జగన్ వేవ్ ని సైతం తట్టుకుని చివరి నిముషంలో విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తే గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అలాంటి గంటాకు ఇపుడు అదే సీటు షాక్ ని ఇచ్చేలా ఉందని అంటున్నారు. శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ ( ఎస్ ఏ ఎస్ ) సర్వేలో విశాఖ ఉత్తరం నుంచి గంటా టీడీపీ అభ్యర్ధిగా 2024లో నిలబడితే మాత్రం కచ్చితంగా ఓడిపోతారని ఈ సర్వే చెబుతోంది.

గంటాకు ప్రత్యర్ధిగా ఉన్న వైసీపీ ఇంచార్జి కేకే రాజు ఇక్కడ నుంచి గెలిచి తీరుతారు అని సర్వే అంటోంది. ఇక స్థానిక ప్రజలు కూడా గెలిచిన తరువాత నుంచి ఎమ్మెల్యే గంటా తమకు కనిపించలేదని చెబుతూ వస్తున్నారు. తమకు ఎమ్మెల్యే అంటే కేకే రాజు అనే అంటున్నారు. దాంతో గంటా సిట్టింగ్ సీట్లో మళ్లీ పోటీ చేస్తే ఓటమి తొలిసారిగా పలకరిస్తుందని అంటున్నారు.

అయితే గంటా వంటి రాజకీయ వ్యూహకర్తకు ఈ విషయాలు తెలియనివి కావు అంటున్నారు. ఆయన రాజకీయ జీవితం చూస్తే పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేయలేదు. అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యాక 2004లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నాటికి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే, 2014లో భీమిలీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో విశాఖ ఉత్తరాన్ని ఎంచుకున్నారు.

ఇక వచ్చే ఎన్నికల కోసం భీమిలీ, గాజువాక, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలను టార్గెట్ చేసి పెట్టుకున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఆయా చోట్ల టీడీపీకి ఇంచారులు ఉన్నారు. అదే సమయంలో పొత్తులు కనుక కుదిరితే ఇందులో కనీసం రెండు అయినా జనసేనకు వెళ్తాయని కూడా అంటున్నారు. మరి గంటా శ్రీనివాసరావుకు ఈ సీట్లలో కనుక పోటీకి సిద్ధపడితే అధినాయకత్వం ఇస్తుందా ఒకవేళ ఇవ్వడానికి చూస్తే అక్కడ గంటా కోసం త్యాగం చేసే వారు ఎవరుంటారు అన్నదే చూడాలి.

ఎన్నికలు ఏడాది ఉందనగా గంటా తాను పోటీ చేసే సీటు విషయంలో ఇప్పటికీ ఒక క్లారిటీకి రాలేకపోవడం పట్ల చర్చ సాగుతోంది. అయితే గంటా వంటి బిగ్ షాట్ కి అధినాయకత్వం టికెట్ విషయంలో ఎపుడూ అడ్డుచెప్పదని, ఆయన కోరుకున్న సీటు దక్కుతుందని ఆయన వర్గం అంటోంది. ఏది ఏమైనా గంటాను విశాఖ నార్త్ నుంచి మళ్లీ పోటీ చేయమని అధినాయకత్వం ఆదేశిస్తే మాత్రం రాజకీయంగా ఆయనకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.

ఇక గంటా నాలుగేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న చోట టీడీపీ ఓడిపోతుంది అని సర్వే నివేదిక రావడం సైతం అధినాయకత్వం పరిశీలనలో ఉంటుందని అంటున్నారు. తెలుగుదేశం తరఫున 23 మంది నెగ్గితే అందులో ఈ రోజుకు పార్టీని అట్టేపెట్టుకున్న వారు 19 మంది ఉన్నారు. వీరిలో అంతా తిరిగి గెలుస్తారనే సర్వే నివేదికలు వెల్లడించాయి. మరి గంటా విషయంలోనే ఇలా జరగడం అంటే హై కమాండ్ వేరేగా ఆలోచిస్తుందా అన్నది కూడా చర్చగా ఉందిట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.