Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టు చదవాల్సిందే

By:  Tupaki Desk   |   20 April 2022 7:30 AM GMT
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టు చదవాల్సిందే
X
ప్రజల్ని ప్రభావితం చేసే రంగాలు కొన్నే ఉంటాయి. అందుకే.. ఆయా రంగాలకు ఉండే ఛరిష్మా మిగిలిన రంగాలకు భిన్నంగా ఉంటుంది. కొన్ని రంగాల్లో పని చేసే వారికి పెద్ద ఎత్తున ప్యాకేజీలు రాకపోవచ్చు. కానీ.. వారికుండే విలువ.. గౌరవం మాత్రం వేరే లెవల్లో ఉంటాయి. అలాంటి రంగమే మీడియా. ఇప్పుడంటే ఎవరికి వారు నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు కానీ.. ఒకప్పుడు పాత్రికేయం అన్నంతనే పరమ పవిత్రంగా ఉండేది. ఆ రోజుల్లో పని చేసిన పాత్రికేయులు కొందరు.. మర్యాదకు ఇచ్చే టీ కూడా తీసుకునే వారు ఉండరంటే ఇప్పుడెవరూ నమ్మరు.

అంతదాకా ఎందుకు? తెలుగు మీడియాలో పని చేసిన ఒక సీనియర్ రాజకీయ జర్నలిస్టు.. తాను చూసే రాజకీయ పార్టీ ఆఫీసులో ఇచ్చే మంచినీళ్లను కూడా తాగేవారు కాదని చెబుతారు. అది కూడా తప్పేనన్న భావనతో ఇంటి నుంచి తనతో పాటు సీసాలో నీళ్లు తెచ్చుకునే వారు. అక్కడి దాకా ఎందుకు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక జిల్లా విలేకరి అయితే.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో ప్రయాణించి.. ఆ తర్వాతి రోజున తాను ప్రయాణించిన దూరానికి ఆర్టీసీ బస్సు ఛార్జీ ఎంతో లెక్క చూసుకొని ట్రెజరీలో చలానా కట్టేవారు. అలాంటి పాత్రికేయులు ఎందరో అప్పట్లో ఉండేవారు. ఇప్పుడు కూడా విలువలతో ఉన్నోళ్లకు కొదవ లేదు. కాకుంటే అలాంటి వారికి గుర్తింపు లేకపోవటం మీడియా రంగానికి ఉన్న ఒక పెద్ద మైనస్.

ఇదంతా ఎందుకంటే.. అప్పట్లో పని చేసిన పాత్రికేయులే కాదు.. మీడియా సంస్థల అధిపతులు కూడా అంతే విలువలతో వ్యవహరించేవారు. రాజకీయ అంశాల్లో నేరుగా జోక్యం చేసుకునే వారు కాదు. ఆ మాటకు వస్తే.. కొమ్ములు తిరిగిన నేతలకు.. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉండకుండా తమ ప్రపంచంలో తాము ఉంటూ.. సమాజానికి పనికి వచ్చే వార్తలకుప్రాధాన్యం ఇచ్చేవారు. పరిచయాలు పెరిగే కొద్దీ.. ఆబ్లిగేషన్లు ఎక్కువ అవుతాయన్న ఆలోచనతో దూరంగా ఉండేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పరిచయాలు పెంచుకోవటం కోసమే మీడియాలోకి వస్తున్న వాళ్లు ఉన్నారు.

మీడియాలో పని చేసే వారే కాదు.. మీడియా సంస్థల యజమానుల తీరులోనూ బోలెడంత మార్పు వచ్చింది. ఆ విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పే ఫేస్ బుక్ పోస్టు ఒకటి సీనియర్ జర్నలిస్టు మంగు రాజగోపాల్ పెట్టారు. అందరిని ఆకర్షిస్తొంది. ముందు దాన్నిచదవిన తర్వాత మరో అంశాన్ని మీతో పంచుకుంటాం. ఆ పోస్టును యథాతధంగా చూస్తే..

ఇది జర్నలిస్టుల ట్రిపుల్ ఆర్
నేనిప్పుడు RRR గురించి రాయబోతున్నాను.
ఇది రాజమౌళి RRR కాదు.
R అంటే రామ్ నాథ్ గోయెంకా..
R అంటే రామోజీ రావు..
R అంటే రీడర్స్

ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు గారి మనవరాలి వివాహ విశేషాల గురించి ఇవాళ ఈనాడు, ఈటీవీలో కళ్లు బైర్లు కమ్మేలాగా వచ్చిన కవరేజ్ చూడగానే నా మనసు నలభై ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. పాత జ్ఞాపకాలు రింగులు రింగులుగా గిర్రుమని తిరిగాయి. నేను ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపుకి చెందిన ఆంధ్రప్రభ, హైదరాబాద్ ఎడిషన్ లో సబ్ ఎడిటర్ గా ఉద్యోగం చేస్తున్న రోజులవి. 1978లోనో, 1979లోనో సరిగ్గా గుర్తు లేదు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రికల యజమాని రామ్ నాథ్ గోయెంకా మనవరాలు కవితా గోయెంకాకి పెళ్లి కుదిరింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్ ప్రెస్, ఆ గ్రూపులో ఉన్న భాషా పత్రికల సిబ్బంది అందరికి పెళ్లి శుభలేఖలు అందాయి. గోయెంకా గారు సిబ్బంది ప్రతి ఒక్కరికీ పంచెలు నీట్ గా ప్యాక్ చేసి కానుకగా పంపించారు.

సరే..పెళ్లి రోజు రానే వచ్చింది. మద్రాసులో పెళ్లి జరిగింది. పెళ్లి ఫోటోలు, వార్తలు, విశేషాల కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. ఇంతకీ రావు. అంతకీ రావు. అవతల ఎడిషన్ డెడ్ లైన్ ముంచుకు వస్తోంది. రెసిడెంట్ ఎడిటర్ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. మా డెస్కు దగ్గరికి వచ్చి ఏమైనా మెసేజ్ వచ్చిందా అని ఆరా తీస్తున్నారు. టెలిప్రింటర్ రూములోకి వెళ్లి అడుగుతున్నారు. మధ్య మధ్యలో పక్కనే ఉన్న ఎక్స్ ప్రెస్ న్యూస్ ఎడిటర్ క్యాబిన్ లోకి వెళ్లి వస్తున్నారు. ఆయన కంగారంతా అప్పటికీ రాని కవితా గోయెంకా పెళ్లి ఫోటోలు, వార్తల గురించే అని డెస్కులో మాకు అర్ధమవుతూనే ఉంది.

ఫోర్మన్ వచ్చి "సార్, టైమవుతుండాది, పేజీ పెట్టడానికి రండి సామీ" అని తొందర చేస్తున్నాడు. నేను బితుకు బితుకుమంటూనే పొత్తూరి వారి క్యాబిన్ లోకి దూరి " సార్, ఎడిషన్ లేటయిపోతోంది. ఫస్ట్ ఎడిషన్ ఇచ్చేద్దాం. కావాలంటే సిటీకి మార్చుకుందాం" అన్నాను. అవతల యజమాని గారి మనవరాలి పెళ్లి. దాని గురించి ఒక్క ముక్క కూడా లేకుండా పేపరు వెళ్తే యాజమాన్యం ఏమనుకుంటుంది? పాఠకులు ఏమనుకుంటారు? ఇలా ఆలోచిస్తున్న పొత్తూరి గారు ఆ మాటే అని, "సరే, ఫైనల్ గా మెడ్రాస్ వాళ్లనే అడుగుదాం" అని ఫోన్ తీశారు. నేను బయటికి వచ్చేశాను. అందరం పొత్తూరి గారి క్యాబిన్ వైపే చూస్తున్నాం. కాస్సేపయాకా పొత్తూరి గారు నవ్వు మొహంతో బయటికి వచ్చారు. వస్తూనే అన్నారు. "మీరు ఎడిషన్ ఇచ్చెయ్యండి. దేని కోసం వెయిట్ చెయ్యక్కర్లేదు"

"ఏమయింది సార్!" అని సస్పెన్స్ భరించలేక అడిగాం. అప్పుడు పొత్తూరి గారు ఏం చెప్పారంటే మెడ్రాస్ లో ఓఎస్ డీ గారు పెళ్లి మంటపంలో ఉన్న రామ్ నాథ్ గోయెంకా గారి దగ్గరికి వెళ్లి, "సార్, అన్ని ఎడిషన్ల వాళ్లు పెళ్లి న్యూస్, ఫోటోల కోసం వెయిట్ చేస్తున్నారు" అని చెప్పారు. దానికి రామ్ నాథ్ గోయెంకా గారు చెప్పింది ఇదీ. "చూడండీ..నా మనవరాలి పెళ్లి మా కుటుంబ వ్యవహారం. మన పాఠకులకి ఇందులో న్యూస్ ఇంట్రస్టు ఏమీ లేదు. న్యూసూ లేదు, గీసూ లేదు. ఎడిషన్లు ఆపొద్దని వెంటనే అందరికీ చెప్పండి."

అందుకే మరి... గోయెంకా? మజాకా?

గోయెంకా మాత్రమే కాదు.. మీడియా మొఘల్ గా చెప్పే రామోజీరావు సైతం మొదట్లో ఇలాంటి తీరునే ప్రదర్శించేవారు. ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్ని తన పత్రికలో చోటు ఇచ్చే వారు కాదు. పత్రికలో కీలక స్థానంలో ఉన్న వారు కాస్తంత సాహసించి.. కుటుంబంలోని వేడుకలు.. విషాదాల గురించి పత్రికలో ఇద్దామంటే.. 'ఈ వార్తతో ప్రజలకు సంబంధం ఏముంది?' అంటూ అక్కర్లేదనే వారు. లేదంటే.. చాలా చాలా చిన్నస్థలంలో వార్తను వేసేవారు. ఈ సంప్రదాయానికి ఈనాడు ఎండీ కిరణ్ పెద్ద కుమార్తె పెండ్లి వేడుకతో ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా చెప్పాలి. ఇప్పటి మాదిరే అప్పట్లోనూ.. భారీగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోల్ని పత్రిక మొత్తం పంచేయటం.. ఈటీవీలో లైవ్ ఇవ్వటం లాంటి వాటిపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదంతా చూసినప్పుడు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పటిలా రామోజీ ఎందుకు ఆలోచించటం లేదన్న ప్రశ్న మాత్రం మదిలో మెదలకమానదు.