Begin typing your search above and press return to search.

విలీనం మీద పవన్ ను ఒత్తిడి పెడుతున్న పార్టీ అదేనా?

By:  Tupaki Desk   |   16 Aug 2019 6:19 PM IST
విలీనం మీద పవన్ ను ఒత్తిడి పెడుతున్న పార్టీ అదేనా?
X
నా పక్కన ఒక్కడున్నా చాలు.. పార్టీ నడిపిస్తానంటూ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పార్టీ పెట్టింది ఏదో ఒక పార్టీలో కలిపేయటానికి కాదంటూ సన్నిహితుల దగ్గర ఆగ్రహంతో వ్యాఖ్యానిస్తున్న పవన్..తనను కలిసిన కార్యకర్తలు ముందు మాత్రం కాస్తంత కూల్ గా.. మరికాస్త క్లారిటీగా విలీనం లాంటివి తన దగ్గర నడిచే ప్రసక్తే ఉండదని స్పష్టం చేస్తున్నారు.

తాజాగా విజయవాడ పార్లమెంటు పరిధిలోని పార్టీ నేతలతో సమావేశమైన పవన్.. తమ పార్టీని విలీనం చేయాలంటూ ఒక పెద్ద పార్టీ ఒత్తిడి తెస్తుందని పవన్ వెల్లడించారు. అదే సమయంలో.. తన పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను సత్యం కోసం పని చేసేవాడినని చెప్పిన ఆయన.. తన బలం ఏమిటో.. బలహీనత ఏమిటో తెలుసని చెప్పారు. అభిమానుల అత్యుత్సాహం మీద కాస్త అసహనాన్ని వ్యక్తం చేశారు. రోడ్డు మీదకు వెళ్లి.. సోషల్ మీడియాలో వెళ్లి చెబితే వినటానికి తనదేమీ కాంగ్రెస్ పార్టీ కాదని పవన్ తేల్చారు. ఇటీవల కాలంలో పదే పదే తన పార్టీని విలీనం చేయాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు పవన్.

పవన్ నోటి నుంచి విలీనం మాట అదే పనిగా ఎందుకు వస్తోంది? అన్నది ప్రశ్నగా మారింది. పార్టీని విలీనం చేయమని అడిగితే.. ఎస్ అంటే అంతా ఓకే.. నో అంటే ప్రపోజల్ తెచ్చిన వాడికి.. ప్రపోజల్ విన్న వారికి మధ్యనే ఉండాల్సిన వ్యవహారాన్ని బయట ఎందుకు పెడుతున్నట్లు? అన్నది క్వశ్చన్. దీనిపై పార్టీకి చెందిన కీలక నేతల అభిప్రాయం ప్రకారం.. పార్టీని విలీనం చేసేది లేదని స్పష్టం చేసినప్పటికీ.. ఏపీలో పాగా వేయాలని తెగ ఉవ్విళ్లూరుతున్న పెద్ద పార్టీ ఒకటి ఆయనపై అదే పనిగా ఒత్తిడి తెస్తుందన్న మాటను చెబుతున్నారు.

పలుమార్లు తన పార్టీని విలీనం చేసేది లేదని చెప్పినా.. వివిధ పద్ధతుల్లో ఒత్తిళ్లు తీసుకురావటంతో.. ఈ విషయాన్ని ఓపెన్ చేసేయాలని పవన్ భావించినట్లు చెబుతున్నారు. తనకు పార్టీని విలీనం చేసే ఆలోచన లేదని చెప్పేందుకు బహిరంగ ప్రకటనతో తన మీద ఆశలు పెట్టుకున్న వారికి సరైన సంకేతాలు ఇవ్వొచ్చని భావించారని.. అందుకే అలా చెబుతున్నట్లు తెలుస్తోంది.

అయితే.. పట్టువిడవని విక్రమార్కుడి మాదిరి.. ప్రయత్నాలు సాగుతుండటంతో.. తన ఆలోచనలు బహిరంగ పర్చటం ద్వారా.. దయజేసి విలీన రాయబారాలు ఆపమన్న సంకేతంతోనే.. పార్టీ సమావేశ వేదికల మీద మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. మరి.. పవన్ పై ఆశలు పెట్టుకున్న పెద్ద పార్టీ ఇప్పటికైనా తన ప్రయత్నాల్ని ఆపుతుందా? లేక.. మరిన్ని ప్రయత్నాల్ని తెర మీదకు తెస్తుందా? అన్నది ఒక క్వశ్చన్. ఇప్పటివరకూ పట్టుదలతో వ్యవహరిస్తూ.. తాను చెప్పిన మాట మీద నిలబడిన పవన్.. రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తారా? లేదా? అన్నది కాలమే తేల్చాల్సి ఉంటుందని చెప్పక తప్పదు.