Begin typing your search above and press return to search.

అమరావతిపై జగన్ డిసైడ్ అయ్యారు..

By:  Tupaki Desk   |   30 Aug 2019 10:30 AM IST
అమరావతిపై జగన్ డిసైడ్ అయ్యారు..
X
ఏపీ రాజధాని అమరావతి చుట్టు కొనసాగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.. వరద ముంపు అమరావతికి పొంచి ఉందని.. దీనిపై సమీక్షిస్తున్నామని బొత్స అనడంతో టీడీపీ దీన్ని వివాదాస్పదం చేసి అమరావతిని వైసీపీ సర్కారు ఎత్తివేస్తోందని విష ప్రచారం మొదలుపెట్టింది. ఇప్పటివరకు అమరావతి వివాదంపై మంత్రులు స్పందించినా అధికారికంగా ఏపీ సీఎం జగన్ మాత్రం నోరు విప్పలేదు. ఈ వివాదాల నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ తాజాగా అమరావతి రాజధాని పనులపై సీరియస్ గా సమీక్షించారు.

ఇప్పటికే అప్పుల్లో ఉన్నా రాష్ట్రం పైగా నవరత్నాల అమలు నేపథ్యంలో అమరావతి నిర్మాణం విషయంలో రాష్ట్ర ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యిందని సమాచారం. జగన్ ఉన్నతాధికారులు, మంత్రులతో జరిపిన సమీక్షా సమావేశంలో రాజధాని మార్పు లేదని.. అయితే నిధుల లభ్యత, ఆర్థిక పరిస్థితిని బట్టి అమరావతి నిర్మాణంపై ముందుకెళ్తామని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో ఏపీకి రాజధానిగా అమరావతియే ఉంటుందని జగన్ సర్కారు నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది.

ఇక చంద్రబాబు సర్కారు దాదాపు 64000 మంది రైతుల నుంచి సేకరమించిన భూముల్లో రాజధానిలో కేవలం 43000 మంది రైతులకు ఫ్లాట్లు ఇచ్చారని.. మిగిలిన రైతులకు కూడా వీలైనంత త్వరగా ప్లాట్లు ఇచ్చి వారి బకాయిలు చెల్లించాలని జగన్ సమీక్షలో అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.

ఈ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై టీడీపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. కేవలం చంద్రబాబు ఆయన సన్నిహిత కులాల కోసం రాజధాని నిర్మించుకున్నారని...కానీ తాము ఏపీ ప్రజలందరి కోసం రాజధాని విషయంలో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయడానికి ముందే చంద్రబాబు బంధువులు, టీడీపీ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, లోకేష్ తోడల్లుడు శ్రీభరత్ అమరావతిలో భారీగా భూములు కొన్నారని ఆధారాలను బొత్స చూపి సంచలనం సృష్టించారు.