Begin typing your search above and press return to search.

షాకింగ్.. భార‌త్ అప్పుల‌పై ఐఎంఎఫ్ చెబుతున్న‌దిదే!

By:  Tupaki Desk   |   13 Oct 2022 7:59 AM GMT
షాకింగ్.. భార‌త్ అప్పుల‌పై ఐఎంఎఫ్ చెబుతున్న‌దిదే!
X
రానున్న ఆర్థిక మాంద్యంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) భార‌త‌దేశ రుణాల‌పై మ‌రోమారు హాట్ కామెంట్స్ చేసింది. భార‌త్ అప్పులు ఆందోళ‌న‌క‌ర స్థాయిలో ఉన్నాయ‌ని బాంబుపేల్చింది. ఏ వ‌ర్థ‌మాన దేశానికి లేని రీతిలో మొత్తం జీడీపీలో అప్పులు 84 శాతానికి చేరుకున్నాయ‌ని వెల్ల‌డించింది. అయితే ఈ అప్పుల్లో అధిక భాగంలో రూపాయిల్లో మాత్ర‌మే చెల్లించాల్సి ఉండ‌టం భార‌త్‌కు ఊర‌ట‌నిచ్చే అంశ‌మ‌ని తెలిపింది. ఈ మేర‌కు ఐఎంఎఫ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ (ఆర్థిక వ్యవహారాలు) పాలో మారో హాట్ కామెంట్స్ చేశారు.

జీడీపీలో 84 శాతం మేర అప్పులే ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ఆదాయం, ఖర్చుల విషయంలో భారత్‌ ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాల‌ని ఆయ‌న సూచిస్తున్నారు. అలాగే భార‌త ద్ర‌వ్య‌లోటు అదుపు తప్పడాన్ని కూడా ఆయన లేవ‌నెత్తారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు ఇప్పటికే జీడీపీలో 10 శాతానికి చేరింద‌న్నారు. ఇందులో 6.5 శాతం క్రేంద ప్రభుత్వ వాటా అయితే, 3.5 శాతం రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా ఉందని బాంబు పేల్చారు. మరే పెద్ద వర్థమాన దేశ ద్రవ్యలోటు ఈ స్థాయిలో లేదని పాలో మారో చెప్ప‌డం గ‌మ‌నార్హం.

స్థిరమైన అధిక జీడీపీ వృద్ధిరేటు ద్వారా భారత్‌ ద్రవ్యలోటు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని ఐఎంఎఫ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ (ఆర్థిక వ్యవహారాలు) పాలో మారో చెప్పారు.

మ‌రోవైపు ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ రేటింగ్ సంస్థ.. ఎస్ అండ్ పీ సైతం భార‌త్‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు మరింత విషమిస్తే భారత పరపతి రేటింగ్‌కు ముప్పు వాటిల్లుతుంద‌ని ఎస్‌ అండ్‌ పీ హెచ్చరించింది. అయితే ప్రస్తుతానికి అలాంటి ముప్పేమీ లేదని పేర్కొంది. అధిక జీడీపీ వృద్ధిరేటు, వాణిజ్యలోటు పెద్దగా లేకపోవడం ప్రస్తుతం భారత్‌కు కలిసొచ్చే అంశాలని త‌న తాజా నివేదిక‌లో వెల్ల‌డించింది.

భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తన తాజా అవుట్‌లుక్‌లో తెలిపింది. భారత్‌ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ తగ్గించడం ఇది వరుసగా రెండోసారి కావ‌డం గ‌మ‌నార్హం.

తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా ఐఎంఎఫ్ పేర్కొంది. అయితే వృద్ధి విష‌యంలో ప్ర‌పంచ దేశాల‌తో పోలిస్తే భార‌త్ మెరుగైన స్థాయిలోనే ఉంద‌ని ఐఎంఎఫ్ ఉన్న‌తాధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ఆర్థిక మాంద్య ప‌రిస్థితుల ప్ర‌భావం భార‌త్‌పై కూడా ఉంటుంద‌ని ఐఎంఎఫ్ చెబుతోంది. అయితే దీనివ‌ల్ల భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని.. భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉంద‌ని వివ‌రించింది. ఈ మేర‌కు ఐఎంఎఫ్‌ ఆసియా-పసిఫిక్‌ విభాగాధిపతి కృష్ణన్‌ శ్రీనివాసన్‌ తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.