Begin typing your search above and press return to search.

దేశీయ ఫ్లైట్ జర్నీ ఇలానే ఉంటుందట!

By:  Tupaki Desk   |   17 May 2020 7:00 AM IST
దేశీయ ఫ్లైట్ జర్నీ ఇలానే ఉంటుందట!
X
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజా రవాణా మూతబడటం తెలిసిందే. సోమవారం నుంచి షురూ కానున్న లాక్ డౌన్ 4.0లో మరిన్ని సడలింపులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. రానున్న వారంలో ఏ రోజైనా పరిమత సంఖ్యలో దేశీయ విమానయానం ప్రారంభమయ్యే అవకావం ఉందంటున్నారు. ఈ వాదనకు బలం చేకూరుస్తూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీంతో.. త్వరలోనే దేశీయ విమాన రాకపోకలకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇప్పటివరకూ ఉన్న విధానాలకు భిన్నంగా లాక్ డౌన్ తర్వాత దేశీయ విమానయానానికి సంబంధించి కొత్త తరహా నిబంధనలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకూ డొమెస్టిక్ ప్యాసింజర్లు బోర్డింగ్ పాస్ తీసుకుంటే 45 నిమిషాలు.. లేదంటే గంట ముందు ఎయిర్ పోర్టులో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అది కాస్తా రెండు గంటలకు పెరిగింది.

అంతేకాదు.. ప్రతి ప్రయాణికుడు తప్పని సరిగా తన ఫోన్ లో ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రయాణికుడు తన వెంట ప్రింట్ చేసిన.. లేదంటే ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాసులు ఉంటే మంచిదని చెబుతున్నారు. ప్రయాణంలో భాగంగా ప్రతి ఒక్క ప్రయాణికుడు తప్పని సరిగా ఫేస్ మాస్క్ ధరించాల్సి ఉంటుంది.

డిపార్చర్ గేటు వద్ద క్యూలో కనిష్ఠంగా నాలుగు.. గరిష్ఠంగా ఆరు అడుగుల దూరంలో ఉండేలా నిర్ణయించారు. ఎయిర్ పోర్టుకు వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక హ్యాండ్ శానిటైజర్ కియోస్క్ లు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వాటి వద్దకు వెళ్లి చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలి. ప్రయాణికులు తమ వెంట 350 ఎంఎల్ శానిటైజర్ బాటిల్ తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు.

థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత.. సాధారణం కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే వారిని క్యూ నుంచి వేరు చేసి.. తదుపరి పరీక్షల కోసం హెల్త్ డెస్క్ వద్దకు పంపుతారు. ప్రయాణికులు తమ వెంట హ్యాండ్ బ్యాగేజీ తీసుకెళ్లేందుకు అనుమతించరు. లగేజ్ కూడా 20కేజీల కంటే తక్కువ బరువు మాత్రమే ఉండాలి.
ఇప్పటి మాదిరి ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రస్తుతం ఉన్న కౌంటర్లను యథాతధంగా వినియోగించే వీల్లేదు. బోర్డింగ్ పాసులు.. టికెట్లు ఇచ్చే కౌంటర్లు ఒకటి విడిచి మరొకటి ఏర్పాటు చేస్తారు. వీలైనంతవరకూ సిబ్బంది తో పని లేకుండా.. ఆటోమేటిక్ విధానంలోనే చెక్ చేసే ఏర్పాట్లు చేయనున్నారు.

విమాన ప్రయాణంలోనూ ఫుడ్ ఆర్డర్ చేయటం.. వాటిని అందించటం మొత్తం కాంటాక్ట్ లెస్ గానే జరుగుతుంది. విమానం ఎక్కేందుకు ఫ్లైట్ బయలుదేరటానికి పదిహేను నిమిషాల ముందు మాత్రమే అనుమతించేవారు. ఇప్పుడు అది కాస్తా గంట ముందే అనుమతిస్తారు. ప్రయాణికుల్ని విమానం వరకూ తరలించే బస్సుల్ని రోజుకు రెండు..మూడుసార్లు శానిటైజ్ చేయనున్నారు. ఎయిర్ హోస్టెస్కు పీపీఈకిట్లు ధరించేలా చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా విమాన ప్రయాణం లో చాలానే మార్పులు చోటు చేసుకోవటం ఖాయం.