Begin typing your search above and press return to search.

`సంక్షేమ ఆంధ్ర`- దిశ‌గా జ‌గ‌న్ అడుగులు.. బ‌డ్జెట్ ప్రాధాన్యం ఇదే...!

By:  Tupaki Desk   |   10 July 2019 7:11 AM GMT
`సంక్షేమ ఆంధ్ర`- దిశ‌గా జ‌గ‌న్ అడుగులు.. బ‌డ్జెట్ ప్రాధాన్యం ఇదే...!
X
సంక్షేమ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌- అన్ని వ‌ర్గాల్లోనూ కులాలు- మ‌తాలు- పార్టీల‌కు అతీతంగా అర్హులైన వారికి ప్ర‌భుత్వ ఫ‌లాలు అందిస్తూ.. ప్ర‌తి ఒక్క‌రినీ సంతృప్తి ప‌రిచే దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం అడుగులు వేస్తోందా? వ‌చ్చే ఐదేళ్ల త‌ర్వాత కూడా జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వాన్ని ప‌దిలంగా ఉంచుకోవాల‌ని భావిస్తున్నారా? ఈ దిశ‌గా అడుగులు వేసేందుకు ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న తొలి బ‌డ్జెట్ రూపు రేఖ‌లు నిర్దేశించుకున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నాయి సంబంధిత వ‌ర్గాలు. ఈ నెల 12, శుక్ర‌వారం జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వం తొలి బ‌డ్జెట్‌ ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తు పూర్తి అయిపోయింది. ఈ క్ర‌మంలో స‌ర్వ‌త్రా దీనిపై ఆస‌క్తి నెల‌కొంది.

మూస విధానంలో కాకుండా.. మేం ఇంత ఇస్తున్నాం.. మీ నుంచి ఇంత తీసుకుంటాం.. అనే ధోర‌ణిని విడిచి పెట్టి.. సంక్షే మం అందించ‌డ‌మే ధ్యేయంగా బ‌డ్జెట్ కేటాయింపులు, నిధుల వినియోగం ఉండేలా జ‌గ‌న్ అన్ని రూపాల్లోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్నికల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చే దిశ‌గా ప్ర‌తి అడుగు అభివృద్ది మార్గంలో ప‌డేలా వ్యూహాత్మ‌కంగా బ‌డ్జెట్‌ ను రూపొందించారని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌పై ప‌న్నులు మోప‌కుండా చూడాల‌ని కూడా నిర్దేశించుకున్నారు. అయితే, మ‌ద్య నిషేధాన్ని ఈ ఏడాది అక్టోబ‌రు 2(గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రిం చుకుని) నుంచి అమ‌ల‌లోకి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

దీనివ‌ల్ల ప్ర‌భుత్వంపై దాదాపు 2 వేల కోట్ల రూపాయ‌ల భారం ప‌డుతుంది. దీనిని అధిగ‌మించేందుకు ఉన్న మార్గాల‌ను వెతుకుతున్నారు. ఈ క్ర‌మంలోనే కార్పొరేట్ ప‌న్నును తొలిసారి ఏపీలో ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. బ‌డాబాబుల నుంచి కొంత మేర‌కు ప‌న్ను రూపంలో రాబ‌ట్టుకుని, పేద‌ల‌కు ఇవ్వాల‌నే ధ్యేయంతో బ‌డ్జెట్‌ లో మార్పులు చేశారు. ఇక పింఛ‌న్ల పెంపు- సంక్షేమం అమ‌లుకు అయ్యే వ్య‌యాన్ని, ఉద్యోగుల జీత భ‌త్యాలు పెంచ‌డం ద్వారా పెరిగిన వ్య‌యాన్ని కూడా మ‌రో రూపంలో రాబ‌ట్టుకోవ‌డంతోపాటు ప్ర‌భుత్వం త‌ర‌ఫున జ‌రుగుతున్న దుబారాకు అడ్డుక‌ట్ట వేయాల‌ని కూడా జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న బ‌డ్జెట్‌ పై త‌న దైన ముద్ర ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.