Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ కు వాడే మందులేంటి? వెల్లడించిన ప్రముఖ వైద్యుడు

By:  Tupaki Desk   |   25 Dec 2021 9:33 AM GMT
ఒమిక్రాన్ కు వాడే మందులేంటి? వెల్లడించిన ప్రముఖ వైద్యుడు
X
ప్రపంచ వ్యాప్తంగా షాకుల మీద షాకులు ఇస్తున్న ఒమిక్రాన్ కేసులు.. దేశంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్.. న్యూఇయర్ సందర్భంగా విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎయిర్ పోర్టుల్లో తనిఖీలు నిర్వహించే విషయంలో దొర్లే తప్పులు.. ఒమిక్రాన్ కేసుల్ని పెంచేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్ బారిన పడిన వారికి ఎలాంటి మందుల్ని ఇస్తారు? వారికిచ్చే మందుల ప్రోటోకాల్ ఏమిటన్న దానిపై స్పష్టత లేదు.

ఏ సమాచారాన్ని అయినా ఇట్టే ఇచ్చే గూగులమ్మ సైతం.. ఒమిక్రాన్ పేషెంట్లకు ఇస్తున్న మెడిసిన్లు ఏమిటన్న ప్రశ్నకు సైతం ఎక్కువ సమాచారాన్ని ఇవ్వలేకపోతోంది. ఇలాంటి వేళ.. ఒమిక్రాన్ రోగులకు ఇచ్చే ట్రీట్ మెంట్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ విషయాల్ని ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యులు కొన్ని వివరాల్ని వెల్లడించారు. నిజానికి ఒమిక్రాన్ కు ఎలాంటి మందుల్ని వినియోగించాలన్న దానిపై స్పష్టత లేదు.

తమకున్న అనుభవం.. కరోనా వేళ పేషంట్లకు చేసిన ట్రీట్ మెంట్ ఆధారంగా మందుల్ని ఇస్తున్నారు. ఇక.. లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యులు చెబుతున్న వివరాల్ని చూస్తే.. ఒమిక్రాన్ బాధితులకు మల్టీ విటమిన్ టాబ్లెట్లతో పాటు పారాసెటమాల్ మాత్రల్ని అందిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇంతకు మించి ఇతర ఔషధాలు ఏమీ అవసరం లేదని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

కాకుంటే.. ఎవరైనా పేషెంట్ కు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండి.. ఒమిక్రాన్ నేపథ్యంలో పాత సమస్యలు తిరగబెట్టినా.. తీవ్రత ఎక్కువగా ఉన్నా అందుకు సంబంధించిన మందుల్ని కూడా ఇస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలి ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో 90 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని.. ఇదో రిలీఫ్ కలిగించే అంశంగా చెబుతున్నారు.

కొంతమందిలో మాత్రం గొంతునొప్పి.. స్వల్ప జ్వరం.. ఒళ్లు నొప్పులు ఉన్నట్లు చెబుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం లోక్ నాయక్ ఆసుపత్రిలో 40 మంది ఒమిక్రాన్ బాధితులు ఉండగా.. అందులో 19 మంది పేషెంట్లు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావటం గమనార్హం. దేశ వ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్ కేసులు ఇప్పటికి 350 వరకు ఉన్నాయని.. క్రిస్మస్ పూర్తి అయ్యేసరికి ఇవి కాస్తా 400 కేసులు అయినా ఆశ్చర్యం లేదంటున్నారు. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ యాక్టివ్ కేసులు 244గా చెబుతున్నారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 88ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మిగిలిన రాష్ట్రాల్లో ఒక మోస్తరుగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం 100 దేశాలకు పాకిన ఒమిక్రాన్.. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే.. అత్యధిక వేగంతో విస్తరించటమే దీనితో ఉన్న పెద్ద తలనొప్పిగా చెబుతున్నారు.