Begin typing your search above and press return to search.

ఉచిత పథకాలపై 'స్టాలిన్' పార్టీ అభిప్రాయం ఇదే

By:  Tupaki Desk   |   17 Aug 2022 3:00 PM IST
ఉచిత పథకాలపై స్టాలిన్ పార్టీ అభిప్రాయం ఇదే
X
ఉచిత పథకాలపై ఇటీవల కాలంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయటంతో పాటు.. రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని తెలియజేయాలని కోరింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కాంగ్రెస్.. ఆమ్ ఆద్మీ పార్టీలు వీటిపై తమ అభిప్రాయాల్ని వెల్లడించారు.

తాజాగా తమిళనాడు అధికార పార్టీ డీఎంకే తన అభిప్రాయాన్ని వెల్లడించింది. పేదలకు సంక్షేమ పథకాల్ని అందించే ప్రక్రియలో భాగంగా ఉచిత పథకాల్ని అమలు చేసే అంశానికి మద్దతు తెలిపింది. రాజ్యాంగంలోని 38వ అధికరణం ప్రకారం ఆర్థిక న్యాయాన్ని కలిగింది.. అంతరాలను తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

తాము ఇస్తున్న ఉచిత పథకాలు నిరుపేదలకు కనీస అవసరాలను మాత్రమే అందిస్తున్నట్లుగా పేర్కొంది. తమిళనాడులోని నిరుపేదలకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని పేర్కొంది. దీంతో పేదల జీవన ప్రమాణాలు పెరగటంతోపాటు వారి పిల్లలకు విద్యాబుద్ధలు కూడా మెరుగైనట్లుగా వెల్లడించింది.

ఈ కేసులో కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేర్చకపోవటం తప్పుగా పేర్కొంది. రాష్ట్రాల్లోని పార్టీలపైనే పిటిషన్ ఫోకస్ చేసినట్లుగా విమర్శించింది.

ఈ సందర్భంగా ఆసక్తికర వాదనను స్టాలిన్ నేత్రత్వంలోని డీఎంకే వినిపించింది. విదేశీ కంపెనీలకు కేంద్రం ఇచ్చే ట్యాక్స్ హాలిడేస్.. పెద్ద సంస్థల రుణాల రద్దును కూడా ఉచితాలుగా పేర్కొనాలని.. వాటిని ఆ జాబితాలోకి తీసుకోవాలన్న అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే..

ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఉచితాల్ని సమర్థించింది. తగిన చట్టాలు చేయకుండా ఎన్నికల హామీలపై పరిమితులు రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పింది. ద్రవ్యలోటును అదుపులోకి తీసుకురావటం కోసం ఎన్నికల హామీలు.. పథకాలపై ఆంక్షలు విధించటం సరికాదని స్పష్టం చేసింది.