Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ బీజేపీకి గుడ్ బై చెప్తార‌న‌డానికి ఇవ‌న్నీ ఆధారాలా?

By:  Tupaki Desk   |   22 July 2022 8:35 AM GMT
ప‌వ‌న్ బీజేపీకి గుడ్ బై చెప్తార‌న‌డానికి ఇవ‌న్నీ ఆధారాలా?
X
జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీ పొత్తు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టేనా అంటే అవున‌నే అంటున్నారు.. రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇటీవ‌ల జ‌రిగిన ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డం, క‌నీసంగా మాట‌మాత్రంగానైనా లేదా సోష‌ల్ మీడియా ద్వారా అయినా బీజేపీ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని కోర‌క‌పోవ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు.

అలాగే ఇటీవ‌ల ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజరుకాక‌పోవ‌డం బీజేపీ పొత్తు నుంచి ప‌వ‌న్ ప‌క్క‌కు త‌ప్పుకుంటున్నార‌న‌డానికి మ‌రో నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్, మెగాస్టార్ చిరంజీవి త‌దిత‌రులు పాల్గొన్న ఆ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఆహ్వానం లేక‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న వెళ్ల‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే కోన‌సీమ‌లో జ‌రిగిన కౌలు రైతు భ‌రోసాయాత్ర‌లో ప‌వ‌న్.. అల్లూరి విగ్ర‌హానికి త‌న‌కు ఆహ్వానం అందింద‌ని, అయితే స్థానిక ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజునే కార్య‌క్ర‌మానికి పిల‌వ‌న‌ప్పుడు తాను వెళ్ల‌డం బాగోద‌ని వెళ్ల‌లేద‌ని పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్.. ర‌ఘురామ‌ను కార‌ణంగా చూపి కార్య‌క్ర‌మానికి రాలేద‌ని చెబుతున్నా వాస్త‌వానికి బీజేపీతో క‌ల‌సి న‌డ‌వ‌డంలో ప‌వ‌న్ ఆసక్తిగా లేర‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని మోడీ కార్య‌క్ర‌మానికి డుమ్మా కొట్టార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

అదేవిధంగా తాజాగా రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవిండ్ వీడ్కోలు స‌భ‌కు ఢిల్లీకి రావాల్సిందిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆహ్వానించార‌ని.. అయితే ఆరోగ్య కార‌ణాల వ‌ల్ల ఈ కార్య‌క్ర‌మానికి కూడా హాజ‌రుకాలేన‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు.

ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో బీజేపీతో ప‌వ‌న్ ఇక క‌ల‌సి న‌డ‌వ‌ర‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆత్మ‌కూరు ఉప ఎన్నిక ప్ర‌చారం, భీమ‌వ‌రం కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ దూరంగా ఉన్నార‌ని చెబుతున్నారు. ఇదే క్ర‌మంలో తాజాగా ఢిల్లీలో జ‌రిగే రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం లేద‌ని ప‌వ‌న్ పేర్కొన్నార‌ని అంటున్నారు.