Begin typing your search above and press return to search.

ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పై సీబీఐ వాదన ఇదే

By:  Tupaki Desk   |   24 March 2022 10:03 AM IST
ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పై సీబీఐ వాదన ఇదే
X
పెను సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తాజాగా కడప కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అతడికి బెయిల్ ఇవ్వటం సరికాదంటూ సీబీఐ వాదనలు వినిపించింది.

ఉమాశంకర్ రెడ్డికి బెయిల్ ఇస్తే.. సాక్ష్యులను ప్రభావితం చేస్తారని పేర్కొన్న సీబీఐ.. హత్యకు అవసరమైన ఆయుధాలు.. సామాగ్రిని స్వాధీనం చేసుకోవాల్సిన తరుణంలో బెయిల్ ఇవ్వొద్దని కోరింది.

ఈ సందర్భంగా సీబీఐ వినిపించిన వాదనల్లోని ముఖ్యాంశాల్ని చూస్తే..

- వివేకా తలపై గొడ్డలితో తొలి దాడి చేసింది ఉమాశంకర్ రెడ్డినేనని మా దర్యాప్తులో తేలింది. వాచ్ మేన్ రంగన్న.. అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలాల ప్రకారం వివేకా హత్య చేసిన నలుగురిలో ఉమాశంకర్ రెడ్డి పాత్ర కీలకం.

- వివేకాను ఆయన ఇంట్లో ఎర్ర గంగిరెడ్డి.. సునీల్ యాదవ్.. ఉమాశంకర్ రెడ్డి.. దస్తగిరి కలిసి హత్య చేశారు. ఆ సమయంలో తిడుతూ గొడ్డలితో ఆయన తలపై తొలి వేటు వేసింది ఉమాశంకర్ రెడ్డినే.

- ఐదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారు. అందులో భాగంగానే గంగాధర్ రెడ్డి.. ఎంవీ క్రిష్ణారెడ్డి.. సీఐ శంకరయ్య మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు అంగీకరించిన తర్వాత మాట మార్చారు.

- అసలైన కుట్ర దారులు తెలుసుకునేందుకు ఉమాశంకర్ రెడ్డికి నార్కో పరీక్షలు చేయించటానికి పులివెందుల కోర్టులో పిటిషన్ వేస్తే.. అతను నిరాకరించాడు.

ఉమాశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ వినిపించిన వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. అతడు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ ఉత్తర్వుల్ని జారీ చేసింది. అదే సమయంలో ఈ కేసులో కీలక సాక్ష్యులుగా మారిన దస్తగిరి.. వాచ్ మేన్ రంగన్న భద్రత పై సీబీఐ వేసిన పిటిషన్ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.