Begin typing your search above and press return to search.

ఇది.. బీజేపీకి డెత్ బెల్ కాదా? క‌మ‌ల నాథుల ఆత్మ ప‌రిశీల‌న‌!

By:  Tupaki Desk   |   4 March 2021 3:25 AM GMT
ఇది.. బీజేపీకి డెత్ బెల్ కాదా?  క‌మ‌ల నాథుల ఆత్మ ప‌రిశీల‌న‌!
X
జ‌రుగుతున్న ప‌రిణామాలు.. భ‌విష్య‌త్తులో బీజేపీకి డెత్ బెల్స్ మోగించ‌నున్నాయా? బీజేపీకి ఇబ్బందిక‌ర ప‌రిణామాల‌ను తీసుకువ‌స్తాయా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌స్తుతం నాలుగు రాష్ట్రాలు(త‌మిళ‌నాడు, కేర‌ళ‌, అస్సాం, బెంగాల్‌), ఒక కేంద్ర పాలిత ప్రాంతం(పుదుచ్చేరి)ల‌లో ఎన్నిక‌లకు రంగం సిద్ధ‌మైంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒక్క అస్సాంలో త‌ప్ప‌.. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి అంత సీన్ లేద‌నే వాద‌న ఉంది. త‌మిళ‌నాడు ఆప‌శోపాలు ప‌డి.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని అతి క‌ష్టం మీద ఓ 15 స్థానాలు ద‌క్కించుకున్నా.. అన్నాడీఎంకే తాము ఓడిపోతామ‌ని నిర్ధారించుకున్న సీట్ల‌నే బీజేపీకి కేటాయించింది.

ఇక‌, కేర‌ళ‌లోనూ పొత్తుల కుస్తీ ప‌డుతున్న క‌మ‌ల‌నాథుల‌కు ఎటొచ్చీ.. బెంగాల్‌పై మాత్రమే ఫోక‌స్ ఎక్కువ‌గా ఉంది. త‌మ‌కు రాజ‌కీయంగా ఇర‌కాటంగామారిన మ‌మ‌త‌ను ప‌క్క‌న పెట్టించేందుకు శ‌క్తి యుక్తులు ప్లే చేస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మూడు కీల‌క ప‌రిణామాలు.. బీజేపీకి ఇబ్బందిక‌రంగా మారాయి. ఒక‌టి.. రైతులు త‌మ‌కు వ్య‌తిరేకంగా తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇది బీజేపీకి ఇబ్బందిక‌ర ప‌రిణామం.

రెండు.. నానాటికీ పెరుగుతున్న గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లు.. సామాన్యుల‌కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. ఇది కూడా పార్టీలో ఇబ్బంది క‌ర ప‌రిణామాల‌కు దారితీస్తోంది. నాయ‌కులు ఎక్క‌డికి వెళ్లినా.. ఉత్త‌రాదిలో నిలదీస్తున్నారు. ఇక‌, మ‌రో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే..తాజాగా ఉప ఎన్నిక‌లు జ‌రిగిన ఢిల్లీలో బీజేపీ ఖాతా తెర‌వ‌లేక పోయింది. ఇవి చిన్న ఎన్నిక‌లే అయిన‌ప్ప‌టికీ.. మోడీ ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌డుతోంద‌నే భావ‌న‌కు అద్దం ప‌డుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉపఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. ఈఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో విజయ సాధించింది.

ఆప్‌ నాలుగు, కాంగ్రెస్‌ ఒకస్థానంలో విజయం సాధించింది. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఒక స్థానంలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోగా, బీజేపీకి కనీసం ఒక్క స్థానం కూడా దక్కకపోవడం గమనార్హం. మొత్తానికి ఈ ప‌రిణామం.. బీజేపీకి డెత్ బెల్ మోగిస్తోంద‌న‌డానికి కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయని జాతీయ స్థాయి విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. మోడీ ప్ర‌భావం.. త‌మ‌కు ప్ల‌స్ అవుతుంద‌ని.. త‌మను ర‌క్షిస్తుంద‌ని.. అనుకునే రోజులు దాదాపు చెరిగిపోతున్నాయ‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తుండ‌డం .. బీజేపీని క‌ల‌క‌లంలోకి నెడుతోంది. మున్ముందు ఈ ప‌రిణామం.. ఎటు దారితీస్తుందో చూడాలి.