Begin typing your search above and press return to search.

అసలు ఈటల వివాదం ఏంటి? ఆయనేమన్నారు?

By:  Tupaki Desk   |   1 May 2021 6:36 AM GMT
అసలు ఈటల వివాదం ఏంటి? ఆయనేమన్నారు?
X
తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడం.. సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడం తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనమైంది. టీఆర్ఎస్ అనుకూల చానెళ్లలో ఏదో ముందే స్కెచ్ గీసి.. ఎవరో ఉప్పందించినట్టు వరుసగా కథనాలు రావడం.. మున్సిపల్ ఎన్నికలు ముగిశాకే ఇలా జరగడంతో దీని వెనుకాల అసలేం జరిగి ఉంటుందన్న చర్చ సాగుతోంది. తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

కొన్ని ఛానల్స్ లో ముందస్తు ప్రణాళికతో స్కెచ్ వేసుకుని తన క్యారెక్టర్ ను చంపేందుకు ప్రయత్నం జరగుతోందని.. కథనాలు వేసే ముందు చానెల్స్ తన వివరణ కూడా తీసుకోలేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాను అసైన్డ్ భూములను కబ్జా చేశారంటూ వరస కథనాలను ప్రసారం చేశారన్నారు. ఇన్విస్టిగేషన్ చేయాలి కాని, ఒకేసారి అన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేయడం సిగ్గు చేటని అన్నారు. న్యాయం తాత్కాలికంగా అపజయం పాలు కావచ్చని, ఇటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మరని ఈటల రాజేందర్ తెలిపారు.

తాను 2016లో పెద్ద యెత్తున హాచరీ పెట్టాలని భావించానని ఈటెల అన్నారు. జమున హేచరీస్ ను మెదక్ జిల్లాలోని అస్సలు భూమికి విలువ లేని బంజరు భూములున్న అచ్చంపల్లి, హకీంపేట గ్రామాల్లో పెట్టామన్నారు. 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని చెప్పారు. తర్వాత విస్తరణ కోసం మరో 40 ఎకరాలను కొనుగోలు చేశామన్నారు. కెనరా బ్యాంకు నుంచి వంద కోట్ల రుణం తీసుకున్నామని ఈటల రాజేందర్ తెలిపారు.

అయితే చుట్టుపక్కల అసైన్డ్ భూములు ఉండటంతో అధికారులను అడిగానని, ముఖ్యమంత్రికి కూడా చెప్పానని ఈటల అన్నారు. రాళ్లు రప్పలతో కూడిన అసైన్డ్ భూమిని తాను తీసుకోవాలని భావించానని ఈటల రాజేందర్ తెలిపారు. ఒక్క ఎకరం కూడా అసైన్డ్ భూమి తాను స్వాధీనం చేసుకోలేదని, ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయని ఈటల రాజేందర్ తెలిపారు.

1986 నుంచి తనకు కోళ్ల ఫారం బిజినెస్ ఉందన్నారు. 2004 కు ముందే తనకు 120 ఎకరాల భూమి ఉందని ఈటల రాజేందర్ తెలిపారు. తాను ఆత్మగౌరవాన్ని నమ్ముకున్నా నన్నారు. తాను భయపడే వ్యక్తిని కానన్నారు. తన మొత్తం ఆస్తులపై విచారణ జరపాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వేసిన విచారణను ఈటల రాజేందర్ స్వాగతించారు. చిల్లరమల్లర బెదిరింపులకు లొంగిపోనని తెలిపారు. పదవుల కోసం తలొగ్గనని ఈటల రాజేందర్ తెలిపారు. ఎటువంటి విచారణకయినా తాను సిద్ధమని ఈటల రాజేందర్ ప్రకటించారు.

టీన్యూస్ లో నాపై ఆరోపణలు రావడం చూసి బాధేస్తోందని మంత్రి ఈటల అన్నారు. సీబీఐ, ఏసీబీ, ఈడీ,విజిలెన్స్ విచారణకైనా తాను సిద్ధమని ఈటల తెలిపారు. ఒక్క ఎకరం కబ్జా చేసినా కూలగొట్టండని ఈటల అన్నారు. ఓవైపు కంపెనీలు రావాలి.. భూములు ఇస్తామంటూ పెట్టేవారిని ఇలా చేయడం ఏంటని ఈటల ప్రశ్నించారు.

100 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెడితే 100 కోట్ల రాయితీలు ఇచ్చి రిజిస్ట్రేషన్ కు చార్జీలు తీసేసి.. మౌళిక సదుపాయాలు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం నేను కోళ్ల ఫారాం పెడితే ఇలా కక్షసాధింపులు చేయడం ఏంటని ఈటల ప్రశ్నించారు.

నా 20 ఏళ్ల చరిత్రలో ఆత్మగౌరవం కోరుకున్న తనలాంటి వారిపై పోరాట పటిమ గల వారిపై.. బరిగీసి కొట్టాడేవారిపై ఇలాంటి వ్యవహారశైలి మంచిది కాదని ఈటెల తప్పు పట్టారు. ప్రేమకు లొంగుతామని.. అణిచివేతకు తాము లొంగమని ఈటల స్పష్టం చేశారు. ఉగ్గుపాలతోనే ఆత్మగౌరవం కలిపి తాగానని తాను వెనకడుగు వేసేది లేదని మంత్రి ఈటల స్పష్టం చేశారు.