Begin typing your search above and press return to search.

మంత్రిపదవుల గోల..ఈ జిల్లాలో హేళ..

By:  Tupaki Desk   |   24 April 2019 10:59 AM IST
మంత్రిపదవుల గోల..ఈ జిల్లాలో హేళ..
X
చిత్తూరు జిల్లా.. చంద్రబాబు సొంత జిల్లా.. ఈసారి కూడా అక్కడ మెజార్టీ సీట్లు సాధించి బాబుకు చెక్ పెట్టాలని వైసీపీ వేసిన ఎత్తులు ఫలించేలా కనిపిస్తున్నాయట.. పోలింగ్ ముగిసింది. పోలింగ్ సరళి చూసి వైసీపీ శిభిరంలో జోష్ నిండగా.. టీడీపీలో కాస్త నైరాశ్యం అలుముకుందట.. వైసీపీ అభ్యర్థులు గెలుపుపై పూర్తి కాన్పిడెంట్ గా ఉన్నారట..

2014లో చిత్తూరు జిల్లాలో గెలిచిన 8మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఈసారి 2019 ఎన్నికల్లో తిరిగి ఐదుగురు పోటీచేశారు. నగరి నుంచి రోజా.. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పొంగునూరు నుంచి పెద్దిరెడ్డి రాంచంద్రరెడ్డి, గంగాధర నెల్లూరు నుంచి నారాయణ స్వామి, పీలేరు నుంచి చింతల రాంచంద్రరెడ్డిలు పోటీచేస్తున్నారు. ఈ ఐదుగురు ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో ఉన్నారట..

ఇంతటితో చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఆగడం లేదు. ఈసారి ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్న వైసీపీ శ్రేణులు మంత్రి పదవులపై ఇప్పుడు బోలెడు ఆశలు పెంచుకున్నారు. చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఇక్కడ గెలిస్తే తాము మంత్రులుగా సత్తా చాటవచ్చని అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారట..

వైసీపీ అధికారంలోకి వస్తే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న పెద్దిరెడ్డి రాంచంద్రరెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది. పీలేరులో చింతల రాంచంద్రరెడ్డి ఇప్పటికీ మూడు సార్లు గెలిచాడు. నాలుగోసారి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడిపై గెలిస్తే తనకు మంత్రి పదవి ఖాయమనుకుంటున్నారు. ఒక్కో పార్లమెంట్ స్థానం నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవి గనుక ఇస్తే తనకు రాజంపేట పార్లమెంట్ పరిధిలో నుంచి మంత్రి పదవి వస్తుందని చింతల భావిస్తున్నాట..

చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలున్నారు. నగరి నుంచి పోటీచేస్తున్న ఫైర్ బ్రాండ్ రోజాకు అయితే మంత్రి పదవి ఖాయమని, హోంశాఖ ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక చెవిరెడ్డి, నారాయణ స్వామి తమకు జగన్ మంత్రి పదవులిస్తాడని వీరిద్దరూ ఆశిస్తున్నారు. చెవిరెడ్డి జగన్ కు బాగా దగ్గరని తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాడు. నారాయణ స్వామికి ఎస్సీ కోటా ప్రధాన బలంగా ఉంది.

ఇక తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తిరుపతి ఎమ్మెల్యేగా పోటీచేసిన భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ కుటుంబానికి బంధువు, జగన్ కు సన్నిహితుడు. ఈయనకు తిరుపతి పార్లమెంట్ పరిధిలో మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది.

ఇలా మొత్తం చిత్తూరు జిల్లాలోనే మొత్తం ఆరుగురు మంత్రి పదవి ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రమంతా గెలుస్తామా లేదా అని అంతా మథన పడుతుంటే చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం అప్పుడే మంత్రి పదవుల కలలుగనడం.. సోషల్ మీడియాలో శాఖలు కేటాయించుకోవడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.