Begin typing your search above and press return to search.

డెల్టా ప్లస్ వేరియంట్‌ తో మహారాష్ట్రకు థర్డ్ వేవ్ ముప్పు

By:  Tupaki Desk   |   17 Jun 2021 10:30 AM GMT
డెల్టా ప్లస్ వేరియంట్‌ తో మహారాష్ట్రకు థర్డ్ వేవ్ ముప్పు
X
మనదేశంలో తీవ్రమైన ఆందోళనకి కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతోంది. అలాగే , దేశంలో కరోనా మహమ్మారి రికవరీ రేటు కూడా బాగా పెరిగింది. కరోనాను కంట్రోల్‌ చేయడానికి చాలా రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ విధించాయి. ఇప్పుడా తాళాలు కూడా తెరచుకుంటున్నాయి. చాలా చోట్ల సాధారణ స్థితి నెలకొంటోంది. అయితే, థర్డ్‌ వేవ్‌ తప్పదన్న హెచ్చరికలు మాత్రం భయపెట్టిస్తున్నాయి. సెకండ్‌ వేవే ఇంత భయానకంగా ఉంటే థర్డ్‌ వేవ్‌ ఇంకెంత బీభత్సం సృష్టిస్తోందన్న ఆందోళన మొదలయ్యింది. మహారాష్ట్ర అయితే బాగా వణికిపోతోంది.. ఎందుకంటే ఇప్పటి వరకు కరోనాతో ఎక్కువగా నష్టపోయింది మహారాష్ట్రనే. మరణాలు కూడా ఎక్కువగా ఆ రాష్ట్రంలోనే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు డెల్టాప్లస్‌ వేరియంట్ బాగా భయపెట్టిస్తోంది. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తో థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని మహారాష్ట ఆరోగ్యశాఖ అధికారులు చెబుతుండటంతో అధికారులు అలెర్టయ్యారు. మరోవైపు థర్డ్‌వేవ్‌ అంటూ వస్తే మాత్రం సెకండ్‌ వేవ్‌ కు రెట్టింపు సంఖ్యలో కేసులు వస్తాయంటూ మహారాష్ట్ర కరోనా వైరస్ టాస్క్‌ ఫోర్స్‌, వైద్య నిపుణుల బృందం చేసిన హెచ్చరికను ప్రభుత్వం చాలా సీరియస్‌ గా తీసుకుంది. ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే ఇప్పటికే అధికారులను అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించారు.

అలాగే ప్రజల్లో కూడా థర్డ్‌ వేవ్‌ పట్ల అవగాహన పెంచాలని చెప్పారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం అతితొందరలోనే థర్డ్‌ వేవ్‌ రావచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో స్పీడ్‌ పెంచాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు వైద్యులు. అలాగే సెరో సర్వేను కూడా వేగవంతం చేయాలన్నారు. వైద్య నిపుణుల సూచనల మేరకు ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే కార్యరంగంలోకి దూకారు. అన్ని ప్రాంతాలలో మందులు, వైద్య పరికాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల్లో ఎక్కువగా చిన్నారుల్లోనే ఉండటంతో పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సూచించారు.

కరోనా ఫస్ట్‌ వేవ్‌ లోనే మహారాష్ట్ర బాగా నష్టపోయింది. మొత్తం 19 లక్షల మందికి కరోనా వైరస్‌ సోకింది. సెకండ్‌ వేవ్‌ లో ఆ సంఖ్య 40 లక్షలు దాటింది. మరణాలు కూడా ఎక్కువగానే నమోదయ్యాయి. కరోనా వైరస్‌ ఫస్ట్‌ వేవ్‌ లో ప్రభుత్వాలు అప్రమత్తంగా లేవు. అప్పట్లో తగినన్ని సౌకర్యాలు కూడా లేవు. హాస్పిటల్స్‌ లో బెడ్స్‌ దొరకలేదు.. తగిన మందులు కూడా లేవు. సెకండ్‌ వేవ్‌ నాటికి ప్రభుత్వాలు కొన్ని జాగ్రత్తలు పాటించాయి. ఇప్పుడు భారమంతా ప్రజలపైనే ఉంది.. ప్రజలు ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే అంటున్నారు. అందరికీ టీకాలు ఇప్పించగలిగితే కరోనాను అదుపులోకి తీసుకురావచ్చని చెబుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో కూడా ఆల్‌లాక్‌ ప్రక్రియ మొదలయ్యింది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు ప్రారంభమైంది.