Begin typing your search above and press return to search.

తెలంగాణలో థర్డ్ వేవ్ ముగిసింది.. కీలక ప్రకటన చేసిన గడల శ్రీనివాస్

By:  Tupaki Desk   |   8 Feb 2022 10:30 AM GMT
తెలంగాణలో థర్డ్ వేవ్ ముగిసింది.. కీలక ప్రకటన చేసిన గడల శ్రీనివాస్
X
కరోనాకు సంబంధించి కీలక ప్రకటన ఒకటి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కీలక అధికారి చేశారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాకు సంబంధించి ప్రజలను.. ఇప్పటికే మూడు వేవ్ లతో ఉక్కిరిబిక్కిరి చేసిన సంగతి తెలిసిందే.

మొదటి దశతో పోలిస్తే రెండో దశలో దారుణ పరిస్థితుల్ని తెలుగు ప్రజలు చవిచూశారు. మూడో వేవ్ విషయానికి వస్తే.. కేసుల నమోదు ఎక్కువగా ఉన్నప్పటికీ.. తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్ద ఇబ్బందులు ఎదురైంది లేదు. పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ..వారం పాటు ఇంట్లో ఐసోలేషన్ అయితే సరిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మూడో వేవ్ ముగిసిందని ప్రకటించారు.

ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు రెండు శాతం మాత్రమేనని చెప్పారు. మొదటి వేవ్ పది నెలలు.. రెండో వేవ్ ఆరు నెలలు.. మూడో వేవ్ మూడు నెలలు మాత్రమే ఉందన్నారు. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావటంతోనే థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. వచ్చే వారంలో వంద కేసులు మాత్రమే వస్తాయని.. ప్రస్తుతం కరోనా పాజిటివ్ రేటు 2 శాతం మాత్రమే ఉందన్నారు. తెలంగాణలో చేపట్టిన జ్వర సర్వే మంచి ఫలితాల్నిఇచ్చిందన్నారు.

కరోనా మూడో వేవ్ ను తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నట్లు ప్రకటించిన ఆయన.. కొత్త వేరియంట్లు వచ్చినా ప్రమదం లేదన్నారు. ఇకపై కరోనాకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవని.. కేంద్రం కూడా ఆంక్షలు ఎత్తివేసిందన్నారు. కరోనా రానున్న రోజుల్లో సీజనల్ ఫ్లూగా పరిగణలోకి అవకాశం ఉందని చెప్పారు.

కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికి.. ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలని కోరారు. ఆర్థిక స్థితిగతులు గాడిన పడాల్సిన అవసరం ఉన్నందున.. ఉద్యోగుల్ని ఆఫీసులకు పిలిపించాల్సిన అవసరం ఉందన్నారు. తాజా ప్రకటన పలువురు కొత్త స్థైర్యాన్ని ఇవ్వటం ఖాయమని చెప్పక తప్పదు.