Begin typing your search above and press return to search.

మోడీ చేతుల్లోకి త్వ‌ర‌లో న‌ల్ల‌ కుబేరుల మూడో జాబితా!

By:  Tupaki Desk   |   17 Sept 2021 10:00 PM IST
మోడీ చేతుల్లోకి త్వ‌ర‌లో న‌ల్ల‌ కుబేరుల మూడో జాబితా!
X
దేశంలో అక్ర‌మ రీతిలో సంపాదించి.. ఆ డ‌బ్బునంతా విదేశాల్లో దాచుకున్న అక్ర‌మార్కుల న‌ల్ల ధ‌నాన్ని భార‌త్‌కు ర‌ప్పిస్తాన‌ని ఎన్నిక‌ల హామీలో పేర్కొన్న న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని బీజేపీ స‌ర్కారు ఆ దిశ‌గా మ‌రింత వేగంగా అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా న‌ల్ల ధ‌నాన్ని నివారించేందుకు పెద్ద నోట్లు ర‌ద్దు చేశామ‌ని మోడీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఆ ల‌క్ష్యం నెర‌వేర‌ట్లేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

కానీ ఇప్పుడు న‌ల్ల కుబేరుల జాబితాను బ‌య‌ట‌పెట్టే వైపుగా మోడీ సాగుతున్న‌ర‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. స్విస్ బ్యాంకులో ఖాతాలు క‌లిగిన భార‌తీయుల స‌మాచారం ఈ నెల‌లోనే కేంద్ర ప్ర‌భుత్వానికి అంద‌నున్న‌ట్లు స‌మాచారం. అడ్డూ అదుపు లేకుండా దేశంలో అవినీతికి పాల్ప‌డి ఆ సొత్తును విదేశాల్లో దాచుకున్న వాళ్ల‌కు ఇది బ్యాడ్ న్యూసే అని చెప్పాలి. ఆటోమేటిక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ కింద ఇప్ప‌టికే విదేశాల్లో భార‌త పౌరుల బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం రెండు సార్లు పొందింది. 2019 సెప్టెంబ‌ర్‌లో తొలి జాబితా అందుకోగా.. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో రెండో లిస్ట్ భార‌త్ చేతికి అందింది. ఇప్పుడు ఇలా స్విట్ల‌ర్లాండ్ నుంచి మూడో విడ‌త స‌మాచారాన్ని పొంద‌నుంది.

ఈ మూడో జాబితా ప్రకారం.. స్విట్జ‌ర్లాండ్‌లోని భార‌తీయుల ఫ్లాట్లు అపార్ట్‌మెంట్లు ఉమ్మ‌డి యాజ‌మాన్య రియ‌ల్ ఎస్టేట్ ఆస్తుల వంటి పూర్తి వివ‌రాలు కేంద్ర ప్ర‌భుత్వం చేతికి అంద‌నున్న‌ట్లు స‌మాచారం. స్థిర చ‌ర ఆస్తుల వ‌ల్ల వాళ్ల‌కు వ‌చ్చే ఆదాయ వివరాలు కూడా ఆ జాబితాలో ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ జాబితా ద్వారా ఆస్తులు ప‌న్నుల వివ‌రాలు సేక‌రించ‌డం కేంద్రానికి మ‌రింత ఈజీ కానుంది. జాబితాలో ఉన్న పేర్ల ఆధారంగా వాళ్ల ఆదాయ వ్య‌వ‌హారాలు ప‌న్ను విష‌యాల‌పై మ‌రింత నిఘా పెంచే అవ‌కాశం ఉంది. మొత్తానికి విదేశాల్లో ఉన్న న‌ల్ల‌డ‌బ్బును దేశానికి ర‌ప్పించే ప్ర‌య‌త్నాల్లో ఉన్న మోడీ ప్ర‌భుత్వం అందులో విజ‌య‌వంత‌మైతే అంత‌కుమించిన ఆనందం మ‌రొక‌టి ఉండదు. కానీ కావాలనే మోడీ స‌ర్కారు ఈ విష‌యంలో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని బ‌డా వ్యాపార‌వేత్త‌ల కొమ్ము కాస్తుంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.