Begin typing your search above and press return to search.

గూగుల్ చేసే ముందు.. జరభద్రం.. లేదంటే జైలే..

By:  Tupaki Desk   |   8 May 2022 9:49 AM GMT
గూగుల్ చేసే ముందు.. జరభద్రం.. లేదంటే జైలే..
X
ఒకప్పుడు.. అంటే ఓ నలభై యాభై ఏళ్ల కిందట ఏదైనా సమాచారం కావాలంటే, విషయ పరిజ్హానం పెంచుకోవాలంటే ప్రజలు, విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లేవారు. మరికొన్నాళ్లకు.. అంటే ఓ 30, 20 ఏళ్ల కిందట ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే విద్యావంతులు, ఇంట్లోని పెద్దవారిని ఆశ్రయించేవారు. మరిప్పుడో..? ఏదైనా ''గూగుల్'' చేసేయడమే.. అందులోని వికీపీడియా లింక్ ను చూసేయడమే. అందుకనే ఏ విషయమైనా చిటికెలో తెలిసిపోతోంది. గణాంకాలు సహా విశ్లేషణ జరిగిపోతోంది. చరిత్ర సహా సంగతంతా బయటపడిపోతోంది. ఇంటర్నెట్ తెచ్చిన విప్లవం ఇదైతే.. ఇందులో సెర్చింజన్ గూగుల్ అందించిన సౌలభ్యం మరింత..

విషయం మాటున అశ్లీలం.. అశాంతి ప్రేరేపకం
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఎంతటి విషయమైనా చేతుల్లోకి వచ్చేసిందని చెప్పుకొన్నాం కదా..? చకచకా వెదికేయడం.. సమాచారం పట్టేయడం.. జనంలోకి వ్యాపింపజేయడం.. కొన్నేళ్ల కిందటి పరిస్థితులతో పోల్చి చూస్తుంటే ఓ కలలా అనిపిస్తోంది. అయితే, నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్లే, ఇందులోనూ మంచి, చెడు ఉన్నాయి. ముఖ్యంగా విద్వేష వ్యాప్తి, పోర్న్ వీడియోలు సమాజంలో అంశాతికి కారణమైన సందర్భాలు ఉన్నాయి. ఆధునిక కాలంలో ఇంటర్ నెట్ వాడకం ఇలాంటి విపరీతాలకూ దారితీస్తోంది.

ఆధారపడొచ్చు.. మితిమీరొద్దు
ఏ సమాచారం కావాలన్నా గూగుల్ ను ఆశ్రయించడం.. ప్రతి చిన్న విషయానికీ ఆ సెర్చింజన్ సాయం తీసుకోవడం వరకు సరే. ఎవరికీ ఏ అభ్యంతరాలు లేవు. అయితే, కొందరు ఇదే అదనుగా దుర్వినియోగం చేస్తున్నారు. ఉదాహరణకు.. బాంబులు ఎలా తయారు చేయాలి..? అందులో ఏ ముడి పదార్థాలు వాడతారు..? వాటి పేలుడు శబ్దం తీవ్రత ఏమేరకు ఉంటుంది..? ఇలాంటి సమాచారాన్ని కొందరు వెదుకుతున్నారు. నకిలీ వైద్యుల అవతారమెత్తిన కొందరు ఏకంగా శస్త్రచికిత్సలనే గూగుల్ లో చూసి చేస్తున్నారు. ఇకపై ఇలాంటివాటికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై కొన్ని అంశాలను సెర్ఛ్ చేస్తే ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ ఏజెన్సీలు గుర్తించి జైలుకు పంపిస్తాయి. ఇంతకీ ఆ నిషిద్ధ విషయాలు ఏంటో తెలుసుకుందాం.

చైల్డ్ పోర్నోగ్రఫీ
ఈ రోజుల్లో పిల్లలపై లైంగిక నేరాలు అధికమయ్యాయి. పసికందులనూ వదలని దౌర్భాగ్యులు ఉన్నారు. బాలికలపై పెద్ద వయసు వారూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. యువతులు, వివాహితలపై అత్యాచారాలకు లెక్కే లేదు. ఇలాంటివాటికి మూల కారణం అశ్లీల సైట్లు. అందులోనూ చైల్డ్ పోర్నోగ్రఫీ కారణంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న వాదన ఉంది. మరోవైపు చాలా మంది వ్యక్తులు గూగుల్‌లో అశ్లీల సైట్‌లను సందర్శిస్తారు.

కానీ, గూగుల్ లో చైల్డ్ పోర్న్ గురించి సెర్చ్ చేయడం నిషిద్ధం. ఎందుకంటే ఈ విషయంలో భారతదేశంలో ప్రత్యేక చట్టం ఉంది. ప్రివెన్సన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం 2012, 14 ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించడం, సృష్టించడం లేదా కలిగి ఉండటం చట్ట ప్రకారం నేరం. ఈ కేసులో ప్రభుత్వం మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనికిగాను 5 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

గర్భ విచ్ఛిత్తి.. పెద్ద నేరం
ప్రేమ వ్యవహారాలతో.. పెళ్లికాకముందే గర్భం దాల్చిన వారు, వివాహమై పుట్టబోయేది ఆడ బిడ్డ అని తెలిసినవారు కొందరు అబార్షన్లు ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి గర్భవిచ్ఛిత్తి ప్రక్రియల కోసం గూగుల్‌లో వెదుకుతుంటారు. కానీ, అది నిషిద్ధం. మన దేశంలో సరైన వైద్యుని అనుమతి లేకుండా అబార్షన్ చేయడం చట్టవిరుద్ధం. గూగుల్‌కు దాని గురించి సమాచారం ఉన్నప్పటికీ.. అందులో సెర్చ్ చేయడం వల్ల మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అబార్షన్ ఎలా జరుగుతుంది? అబార్షన్ ఎలా చేయాలి? ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. వీటిపై ప్రత్యేక నిఘా ఉంది.

బాంబుల తయారీ గురించి వెదికారో..? వెంటాడతారు
ప్రస్తుతం కాలంలో విదేశీ శక్తులే కాక దేశీయంగానూ విద్రోహ శక్తులు పెరిగిపోయాయి. సమాజంలో ఎప్పుడు కల్లోలం రేపుదామా? అని ప్రయత్నించే వారున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా అశాంతి కలిగించే శక్తులు పొంచి ఉన్నాయి. ఇలాంటివారు చేసేవే విద్రోహ చర్యలు. సమాజంలో విధ్వంసానికి వీరు బాంబు దాడులకూ వెరవరు. దీనికోసం ప్రత్యేకం వ్యక్తుల వద్ద కంటే.. గూగుల్ లో సెర్చ్ చేసి బాంబు ఎలా తయారు చేయాలి? అని తెలుసుకుంటారు.

అంతెందుకు..? గతంలోనూ కొందరు ఇంటర్నెట్ లో చూసి బాంబులు తయారు చేసి విధ్వంసాలకు పాల్పడినట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంోల బాంబుల తయారీపై గూగుల్‌ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సెర్చ్ చేయకండి. అలా చేస్తే మీ కంప్యూటర్ సెక్యూరిటీ ఏజెన్సీల రాడార్ కిందకు వెళ్లిపోతుంది. మిమ్మల్ని మీరు ఇంటెన్సివ్ మానిటరింగ్‌కు గురిచేసే అవకాశాలు ఉన్నాయి. మీరు సెర్చ్ చేసి వదిలేసినా.. మీపై ప్రత్యేక నిఘా ఎప్పటికీ ఉంటుంది. అవసరమైతే మీపై తగిన చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సమాచారం కోసం ఎప్పుడూ వెతకకండి.